స్థానిక ఎన్నికలను తేలికగా తీసుకోవద్దు : చంద్రబాబు
కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చిన పార్టీ అధ్యక్షుడు
అమరావతి : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంపై పూర్తి దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆదేశించారు. ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు. ఎన్టీఆర్ భవన్‌లోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన నాయకుల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఐక్యత , సమన్వయం అవసరమని నొక్కి చెప్పారు. కూటమి ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూల దృక్పథాన్ని ఎన్నికల విజయంగా మలుచు కోవాలని, 2024 ఎన్నికల ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను 2029 ఎన్నికల్లో సాధించే దిశగా కృషి చేయాలని ఆయన అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 25 ప్రాధాన్యతా అంశాలను గుర్తించి, నిర్దిష్ట లక్ష్యాలతో వాటి పరిష్కారానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను కోరారు.
పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి కల్పించడం, ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులను పూర్తి చేయడంపై ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలని చంద్రబాబు నాయడుఉ సూచించారు. అత్యవసర స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రతి నియోజకవర్గానికి రూ. 1 కోటి నిధులు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమర్థులైన మహిళా నాయకులను గుర్తించి, మహిళా రిజర్వేషన్ల కింద వారికి అవకాశాలు కల్పించాలని చంద్రబాబు పార్టీ నాయకులను కోరారు. ఎమ్మెల్యేలు అనుసరించిన ఉత్తమ విధానాలను తదుపరి సమావేశంలో ప్రదర్శిస్తామని ఆయన తెలిపారు. నాయకత్వ ప్రాముఖ్యతను వివరిస్తూ, కేవలం పదవిలో ఉన్నంత మాత్రాన ఎవరూ నాయకులు కారని చంద్రబాబు అన్నారు. ప్రజల సమస్యలను దృఢ సంకల్పంతో పరిష్కరించడం లోనే నిజమైన నాయకత్వం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు , పార్టీ కార్యకర్తలతో నిరంతరం మమేకమై ఉండాలని ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు ఆయన సూచించారు.
ఎన్నికల్లో డబ్బు కంటే ప్రజలు , పార్టీ కార్యకర్తలతో ఉండే భావోద్వేగ అనుబంధం చాలా ముఖ్యమని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నికల విజయం గురించి ప్రస్తావిస్తూ, క్లిష్ట రాజకీయ పరిస్థితుల్లోనూ వరుసగా విజయం సాధించే నాయకుల పనితీరును అధ్యయనం చేసి, వారి విధానాలను అర్థం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నాయకులు అహంకారానికి దూరంగా ఉండాలని, ఎందుకంటే ప్రజలు తమ ప్రతినిధుల ప్రవర్తనను నిరంతరం గమనిస్తూనే ఉంటారని టీడీపీ అధ్యక్షుడు హెచ్చరించారు. నాయకులు ‘కూటమి ధర్మాన్ని’ పాటించాలని, బ్యానర్లు , పోస్టర్ల వంటి అంశాలపై ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య వివాదాలకు తావివ్వ కూడదని చంద్రబాబు నొక్కి చెప్పారు.
