విజయవాడ : మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన రాష్ట్రంలో కొలువు తీరిన కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు తాను కీ రోల్ పోషించిన వైసీపీని కూడా తూర్పార బట్టారు. ఇంత వరకు రెడ్లు, కమ్మలే ఏలారని మిగతా సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కలేదన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ (థర్డ్ వైబుల్ పొలిటికల్ అల్టర్ నేటివ్ పార్టీ) అవసరమైంది అనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ప్రధానంగా రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాటితోపాటు జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, మరికొన్ని నూతనంగా ప్రారంభించిన పార్టీలు… ఇవాళ ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికిగానీ, వాటి మీద పోరాడే పటిమనుగానీ చూపించటం లేదనే పరిస్థితుల్లో.. కొత్త రాజకీయ పార్టీ ఆవశ్యకత ఉందని నేను భావిస్తున్నానని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ రెండు పార్టీల చుట్టు మాత్రమే రాజకీయం తిరుగుతుంది. మొదటిది టీడీపీ-రెండోది వైఎస్ఆర్సీపీ. ఒకసారి టీడీపీ అధికారంలోకి వస్తే.. రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న భావన వారిలో నెలకొందన్నారు. ఈ రెండు రాజకీయ పార్టీలు.. ఇవాళ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. రెండు ఫ్యాక్షన్ రాజకీయ పార్టీలుగా అవతరించాయి. ఇందులో మొదటిది రెడ్ బుక్ పార్టీ టీడీపీ, రెండోది రప్పా.. రప్పా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈ రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతోందంటూ ఎద్దేవా చేశారు. ఆ యుద్ధంలో పోలీసులు న్యాయం వైపు పనిచేయాలే గానీ, అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా పని చేయడం దురదృష్టకరం అన్నారు విజయ సాయి రెడ్డి. దీనిని మనమంతా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ రెండు పార్టీల మధ్య ప్రజలు నలిగిపోతూ, మరోవైపు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతూ ఉంది, ఇంకోవైపు ప్రజలకు భద్రత లేకుండా పోవడంతో, కొత్తగా రాజకీయ పార్టీ ఆవిర్భవించ వలసిన అవసరం ఉందన్నది నా భావన. ఈ రెండు పార్టీలు ఎందుకు కొట్టుకుంటున్నాయి..!? రాష్ట్రంలో ఉన్న కోటి 50 లక్షల కుటుంబాలు, అంటే, 6 కోట్ల ప్రజానీకానికి సంబంధించిన రాష్ట్ర సంపదను ఎవరు దోచుకోవాలనే దానిపైనే ఈ రెండు పార్టీలు పని చేస్తున్నాయి. ఇది రాష్ట్ర ప్రజల దురదృష్టం అన్నారు. ఈ రెండు కుటుంబాలకు చెందిన ఈ పార్టీల రాజకీయ అజెండా ఒక్కటే..” ప్రజలకు గోరంత- మాకు కొండంత..” అనే ఒకే ఒక్క సిద్ధాంతంతో వీళ్ళు ముందుకు వెళుతున్నారు. వీరిద్దరి ధ్యేయం ఒక్కటే, పొలాల్లో మట్టి తీసుకున్నా, వాగుల్లో ఇసుక తీసుకున్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, ఏ పర్మిషన్ కావాలన్నా, ఎన్ వోసీ కావాలన్నా, వ్యాపారం చేసుకోవాలన్నా రౌడీ మామూళ్ళు కట్టాలి., రాజకీయ నాయకులకు, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పాలనలో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ రౌడీ మామూళ్ళు చెల్లించినదే పనులు పూర్తి కాలేని పరిస్థితి నెలకొందన్నారు విజయ సాయి రెడ్డి.
నిద్ర లేస్తే.. ఈ ఒక్క రాజకీయ పార్టీల నాయకులకు సెటిల్ మెంట్లు, దందాలు చేయడం రొటీన్ యాక్టివిటీగా మారింది. గత ఎన్నికల్లో రూ. 20 కోట్లు, 40 కోట్లు ఖర్చు పెట్టాను.. వాటిని రికవరీ చేసుకోవాలి, రాబోయే ఎన్నికలకు మళ్ళీ కూడబెట్టు కోవాలనే లక్ష్యంతోనే ఈ పార్టీల నాయకులు పని చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తమిళనాడులో ఏ తరహా రాజకీయాలు ఉండేవో.. ఆ తరహా రాజాకీయాలను ఈ పార్టీల వారు, ఏపీకి తీసుకొచ్చారు. ఎవరు అధికారంలో ఉంటే.. ప్రత్యర్థులపై కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేసి జైలుకు పంపించడం అజెండాగా మారిందన్నారు. ప్రజల శ్రేయస్సుకోసం ముందుకు వెళతాం, నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.. అన్న దృక్పథాన్ని వదిలేసి.. రక్తాన్ని పారిస్తామన్న ధోరణిలో ఈ రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయని మండిపడ్డారు.
-ఆడబిడ్డల్ని రోడ్ల మీద వివస్త్రను చేసి కొట్టినా, హత్యలు చేసినా, ఆత్మాభిమానంతో గోదావరి నదిలో దూకినా.. వీళ్ళు పట్టించు కోవడం లేదన్నారు. రాష్ట్రంలో… ఎంతసేపటికి లక్షల కోట్లు సంపాదించు కోవాలన్న ధ్యేయంతో ఈ రెండు పార్టీల రాజకీయ నాయకులు ముందుకు వెళుతున్నారని ఫైర్ అయ్యారు విజయ సాయి రెడ్డి. రాష్ట్రంలో కోటి 50 లక్షల కుటుంబాల తరఫున మాట్లాడేటటువంటి రాజకీయ పార్టీనే లేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. 6 కోట్ల ప్రజానీకం కోసం ఈ రెండు పార్టీలు ఉన్నాయా…!? లేక, ఈ రెండు కుటుంబ రాజకీయ పార్టీల కోసం 6 కోట్ల ప్రజానీకం ఉన్నారా..!? అన్నది ప్రజలు గమనించాలన్నారు. అందుకే ఈ కొత్త రాజకీయ పార్టీని నిర్మించాలన్న ఆశయంతో ప్రజల ముందుకు వస్తున్నాను. నాపైన చేసిన ఆరోపణలకు నిజానిజాలు ఏమిటనేవి మీరే తెలుసుకోండి అని పేర్కన్నారు. తాను స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేను ఉండటం లేదని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో రెండు కుటుంబాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా..!? రెండు రాజకీయ పార్టీలు మాత్రమే పరిపాలించాలా..!? రాష్ట్రంలో రెడ్లు, కమ్మ వాళ్ళు మాత్రమే కాదు.. చాలా కులాలు, బీసీల్లో 140 కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రైస్తవులు మొత్తం 6 కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు. ప్రధానమైన కులాల్లో రెడ్డి, కమ్మ కాకుండా, కాపులు ఉన్నారు, వెలమలు ఉన్నారు. కాపులు, వెలమలు, బీసీవర్గాలు, రజకులు, ఎస్సీలు సీఎం కాలేదే.. !? ఎందుకు!? వాళ్ళల్లో సామర్థ్యం ఉన్న వాళ్ళు లేరా..!? ఉన్నారు. వాళ్ళను అణగదొక్కుతూ, ఈ రెండు వర్గాలు మాత్రమే అధికారంలోకి వస్తున్నాయి. పదవులను ఆక్రమించు కుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నా కుటుంబ సభ్యులు కూడా సీఎం అభ్యర్థులు కాదు. ఎవరైతే సామర్థ్యం ఉంటుందో, అనుభవం ఉంటుందో, రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించగలరో, ఏకులానికి చెందిన వారైనా సీఎం అయ్యే అవకాశం కొత్తగా పెట్టబోయే రాజకీయ పార్టీలో ఉంటుందని ప్రకటించారు.. అని నేను నమ్మిన వెంకటేశ్వరస్వామి సాక్షిగా చెబుతున్నానని తెలిపారు. నా రోల్ ఎలా ఉంటుందంటే.. ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో బాల్ థాక్రే మాదిరిగా ఒక మెంటర్ గా ఉంటూ, ఎలా ప్రభుత్వాన్ని నడిపించారో, అలానే సలహాలు, సూచనలు మాత్రమే నేను ఇస్తానని అన్నారు. సీఎం అభ్యర్థికి సామర్థ్యంతోపాటు ముఖ్యంగా దేశ భక్తి ఉండాలని పేర్కొన్నారు విజయ సాయి రెడ్డి. రాజకీయ సన్యాసం అన్నారు.. ఎందుకు రెండేళ్లు మాట్లాడలేదని అడగవచ్చు. రెండేళ్లు నేను మౌనంగా ఉండలేదు. మనం ఏ కులంలో పుట్టాలో మనం కోరుకోం. ఏడాది పాటు నేను ఒక పుస్తకం కోసం కృషి చేశాను. అది యాథృచ్ఛికమే. రెడ్డి సామాజికవర్గం ఎలా ఆవిర్భవించింది. కాపుల నుంచి రెడ్డి సామాజిక వర్గం గ్రామాల్లో గ్రామ పెద్దలుగా ఉండి, ఈ సామాజికవర్గం ఎలా ఉద్భవించింది. రెడ్డి రాజులు ఎలా పరిపాలించారు..? అనే దానిపై 350 పేజీల పుస్తకాన్ని రచించాను. చరిత్రకారుల నుంచి, బ్రిటీష్ కాలం నాటి రికార్డుల నుంచి, వాస్తవాలను మాత్రమే ఈ పుస్తకంలో పొందుపరిచాను. ఈ పుస్తకాన్ని ఎడిటింగ్ కు ఇచ్చాను. తర్వాత అనువదిస్తాం. అడిగిన ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకం ద్వారా, సంవత్సరం రోజుల కృషిని నేను ప్రజల దృష్టికి తీసుకు వస్తాను. ఇది క్యాస్ట్ ఫీలింగ్ తో చేసింది కాదు. నాకు ఇంట్రస్ట్ కొద్దీ ఈ పని చేశాను అని అన్నారు విజయ సాయి రెడ్డి.
