చెన్నై : కంటి దానం ద్వారా ఒక వ్యక్తి ఇద్దరు దృష్టి లోపం ఉన్నవారికి చూపును ప్రసాదించ గలరని ఆరోగ్య, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ కె.జి. అరుణ్‌రాజ్ అన్నారు. ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు నిర్వహించే ‘జాతీయ కంటి దాన పక్షోత్సవాల’లో భాగంగా బెసెంట్ నగర్‌లోని ఎలియట్స్ బీచ్ వద్ద ‘రోటరీ రాజన్ ఐ బ్యాంక్’ ఏర్పాటు చేసిన కంటి దాన అవగాహన ర్యాలీని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని చూడటానికి కంటి చూపు ఎంతో అవసరం అన్నారు. కళ్లను దానం చేయడం ద్వారా ఒక వ్యక్తి ఇద్దరికి చూపును ఇవ్వగలరు అని చెప్పారు. అనేక మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించే అవకాశం ఉన్నప్పటికీ, అవయవ దానంపై ఇంకా తగినంత అవగాహన లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ కళ్లు , అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చేలా ప్రోత్సహించడంలో ప్రముఖులు , ప్రజా ప్రతినిధులు కీలక పాత్ర పోషించగలరని ఆయన సూచించారు.
దివంగత దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఆయన తన కళ్లను దానం చేయాలని తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకున్న తర్వాత సుమారు 600 మంది ముందుకు వచ్చి తమ కళ్లను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారని మంత్రి గుర్తుచేశారు. దృష్టి లోపాన్ని నివారించడానికి తమిళనాడు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోందని డాక్టర్ అరుణ్‌రాజ్ తెలిపారు. కంటి సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించేందుకు వీలుగా బ్లాక్ స్థాయిలో ‘ఫండస్ కెమెరాలను’ ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. స్వచ్ఛంద సేవకులు , స్వచ్ఛంద సంస్థలు మరింత చురుకుగా పాల్గొనాలని కోరారు. కంటి , అవయవ దానానికి ప్రతిజ్ఞ చేయడానికి ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో అవయవ దానంలో తమిళనాడు నిరంతరం అగ్రస్థానంలో కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు.
