‘మెట్రో రైలు – ఆర్టీసీ’ ప్రయాణీకుల కోసం ఉమ్మడి పాస్
వెంటనే ప్రవేశ పెట్టాలని ఆదేశించిన సీఎస్ సంజయ్ జాజు
హైదరాబాద్ : హైదరాబాద్ నగర వాసులకు తీపి కబురు చెప్పింది తెలంగాణ సర్కార్. ప్రతీ రోజూ వేలాది మంది నిత్యం మెట్రో రైలుతో పాటు సిటీ ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తుంటారు. ఈ సందర్బంగా ప్రయాణీకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అటు మెట్రో రైలు ప్రయాణీకులకు, ఇటు ఆర్టీసీ ప్రయాణీకులకు మేలు చేకూర్చే విధంగా ఉమ్మడి బస్ పాస్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా నెలవారీ, రోజువారీ పాస్‌లను జారీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. బేగంపేటలోని మెట్రో రైల్ భవన్లో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ , టీజీఎస్ఆర్టీసీ, విద్యుత్ శాఖ , హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ శాఖ ప్రతినిధులతో ప్రధాన కార్యదర్శి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ మెట్రో మొదటి , రెండవ దశల పనులలో ఇప్పటి వరకు చేపట్టిన వివిధ చర్యల గురించి ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ బి. అజిత్ రెడ్డి , జాయింట్ ఎండీ శివేంద్ర ప్రతాప్ ఆయనకు వివరించారు.
పాతబస్తీ మెట్రో కారిడార్ కోసం చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల ప్రస్తుత స్థితిని ప్రధాన కార్యదర్శి అడిగి తెలుసుకున్నారు. జనరల్ కన్సల్టెంట్‌ను నియమించేందుకు జరుగుతున్న టెండర్ ప్రక్రియ ప్రస్తుత దశను వివరించారు. 7.5 కిలోమీటర్ల పాతబస్తీ కారిడార్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని , మెట్రో ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన ప్రారంభించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. మెట్రో , ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఉమ్మడి పాస్‌ను జారీ చేయడానికి సాంకేతికంగా సిద్ధంగా ఉన్నామని, దీని అమలుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఉమ్మడి ఛార్జీల విధానాన్ని త్వరగా ఖరారు చేసి, పాస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
