హైదరాబాద్ లో ‘టీసీఎస్ – హైపర్ వాల్ట్’ ఏఐ డేటా సెంటర్
భారత దేశంలోనే అతి పెద్ద సెంటర్ కాబోతోందన్న సీఎం
హైదరాబాద్ : తెలంగాణ అరుదైన ఘనత సాధించింది. చారిత్రాత్మక మైలు రాయికి శ్రీకారం చుట్టింది. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ – హైపర్ వాల్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. టాటా గ్రూప్ హైదరాబాద్‌లో భారతదేశంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ క్యాంపస్‌ను నిర్మించనుంది.
ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుండటం, ప్రపంచ ఏఐ మ్యాప్‌లో తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లే చారిత్రాత్మక పరిణామమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్టుతో హైదరాబాద్ గ్లోబల్ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా ఎదగడంతో పాటు భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి బలమైన పునాది పడుతుందని చెప్పారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో టీసీఎస్ ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, నీటి పారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. టీసీఎస్ సీఈఓ కె. కృతివాసన్ , సీఓఓ ఆర్తి సుబ్రమణియన్ , హైపర్ వాల్ట్ ప్రెసిడెంట్ వి. రాజన్న, హైపర్ వాల్ట్ సీఈఓ, ఎండీ దీపేష్ నందా అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉదయ్ రుద్రరాజు పాల్గొన్నారు.
ఏఐ మోడల్స్, కంప్యూటింగ్ సామర్థ్యం భవిష్యత్తులో కీలక ప్రజా మౌలిక వసతులుగా మారనున్న నేపథ్యంలో, ఆ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యం తెలంగాణలోనే అందుబాటులో ఉండటం రాష్ట్రానికి గొప్ప ప్రయోజనమని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణకే కాకుండా దేశానికి ఇది చారిత్రాత్మక ప్రాజెక్టు అని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 లో భాగంగా రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్య సాధనలో ఈ ప్రాజెక్టు కీలక ముందడుగు అవుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్ (1,000 మెగావాట్లు) సామర్థ్యంతో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. హైపర్ వాల్ట్‌తో పాటు భాగస్వామ్య సంస్థలు ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ కోసం దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఏఐ కంపెనీలు, హైపర్‌స్కేలర్లు, గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌కు అవసరమైన భారీ కంప్యూటింగ్ మౌలిక వసతులను ఈ క్యాంపస్ అందించనుంది. అధిక సామర్థ్యమున్న కంప్యూటింగ్ వ్యవస్థలు, లిక్విడ్ కూలింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని అభివృద్ధి చేయనున్నారు. గ్రీన్ ఎనర్జీ వినియోగం, వాటర్-న్యూట్రల్ డిజైన్‌తో పర్యావరణ అనుకూలంగా క్యాంపస్‌ను తీర్చి దిద్దనున్నారు. ఈ భారీ పెట్టుబడితో ఏఐ, డేటా సెంటర్ల రంగంతో పాటు విద్యుత్, కూలింగ్, నెట్‌వర్కింగ్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి అనుబంధ రంగాల్లోనూ కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. దేశంలోని అత్యంత అధునాతన, అతిపెద్ద ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్‌లలో ఇది ఒకటిగా నిలవనుంది.
తెలంగాణ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన టీసీఎస్, హైపర్ వాల్ట్ ప్రతినిధులను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయంతో తన కల నెరవేరిందని అన్నారు.
