మాజీ మంత్రి నెహ్రూపై దాడులు కక్ష సాధింపు కాదు
స్పష్టం చేసిన ఇంధన వనరుల శాఖ మంత్రి నిర్మల్ కుమార్
చెన్నై : మాజీ డీఎంకే మంత్రి కేఎన్ నెహ్రూ నివాసాలు , కార్యాలయాలపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డీవీఏసీ) ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. ఇదంతా కక్ష సాధింపు చర్యలేనంటూ పెద్ద ఎత్తున డీఎంకే ఆరోపించింది. దీనిపై తీవ్రంగా స్పందించారు రాష్ట్ర ఇంధన వనరులు, న్యాయ శాఖ మంత్రి కె. నిర్మల్ కుమార్. ఆయన డీఎంకే చేసిన కామెంట్స్ ను తేలికగా తీసుకున్నారు. తమ ప్రభుత్వం ప్రజా పాలన సాగిస్తోందని, ప్రతిపపక్ష పార్టీలను కావాలని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడడం లేదన్నారు. ఇది గుర్తించాలని సూచించారు. ఆ సంస్థ తీసుకున్న చర్యలు ఫిర్యాదులు , ఆధారాలపై ఆధారపడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి సిమ్మక్కల్‌లో స్వాతంత్ర్య సమరయోధుడు V.O. చిదంబరనార్ 155వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు నిర్మల్ కుమార్. డీవీఏసీ పనితీరులో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని అన్నారు.
నెహ్రూకు సంబంధించిన కేసు వివరాలు తనకు తెలియవని, తీసుకున్న చర్యలపై ఆ సంస్థే స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. తమిళనాడులో ప్రజలు సురక్షితంగా లేరని డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ , తూత్తుకుడి ఎంపీ కనిమొళి కరుణానిధి చేసిన ఆరోపణలకు స్పందిస్తూ పేదలు , సామాన్య ప్రజలకు పూర్తి రక్షణ ఉందని నిర్మల్ కుమార్ అన్నారు. అవినీతిపరులపై కేసులు నమోదు అవుతున్నాయి కాబట్టి, వారికి మాత్రమే రక్షణ ఉండదు అని ఆయన పేర్కొన్నారు. టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రహస్యంగా ఒప్పందం చేసుకున్నాయని నిర్మల్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. 2029 లోక్‌సభ ఎన్నికల్లో టీవీకే కూటమిని ఎదుర్కోవడానికి ఈ రెండు ద్రావిడ పార్టీలు బీజేపీతో కూడా చేతులు కలిపే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
