ముంబై : శివసేన బాల్ ఠాక్రే పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన అస్వస్థకు గురయ్యారు. ఈ సందర్బంగా జరిపిన వైద్య పరీక్షల్లో తనకు క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన షాక్ కు గురయ్యారు. జీవితంలో ఇవన్నీ మామూలేనని పేర్కొన్నారు. ఈ సందర్బంగా సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బలమైన గొంతుకగా ఉన్న తనను లేకుండా చేయాలని కొన్ని శక్తులు కుట్రలకు తెర లేపాయంటూ ఆరోపించారు. ప్రధానంగా తనను జైలుకు పంపించడం అందులో భాగమేనని పేర్కొన్నారు. జైలులో విష ప్రయోగం వల్లే తనకు క్యాన్సర్ వచ్చి ఉండవచ్చని సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా సంజయ్ రౌత్‌కు గత ఏడాది దీపావళికి కొన్ని రోజుల ముందు, నవంబర్ 2025లో కడుపు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇంట్లో , ఆసుపత్రిలో తాను అనుభవించిన బాధాకరమైన కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సల గురించి ఆయన గతంలో ఇంటర్వ్యూలలో మాట్లాడారు.
ముంబై: జైలులో ఉన్నప్పుడు తనపై విషప్రయోగం జరిగి ఉండవచ్చని, అదే తన కడుపు క్యాన్సర్‌కు కారణమై ఉండవచ్చని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి, ‘టాక్సిసిటీ టెస్ట్’ (విష పదార్థాల ఉనికిని గుర్తించే పరీక్ష) చేయించు కోవాలని తనకు సూచించారని ఆయన చెప్పారు. జైలులో పెట్టిన ఆహారం వల్లే తనకు అనారోగ్యం కలిగి ఉండవచ్చని అనుమానించడం మొదలు పెట్టానని రౌత్ తెలిపారు. సుమారు 10 రోజుల క్రితం రాహుల్ గాంధీ కూడా ఇదే విధమైన అనుమానాన్ని వ్యక్తం చేశారని, మనలాంటి వారికి జైలులో ఏమైనా జరగవచ్చు అని హెచ్చరిస్తూ పరీక్ష చేయించు కోవాలని సూచించారని రౌత్ పేర్కొన్నారు.
ప్రభుత్వం ఎంత క్రూరమైనదంటే జైలులో ఉన్నప్పుడు ఏదైనా చేయగలదు. గతంలో జైలులో ఉన్నప్పుడు మరికొంత మంది నాయకుల ఆరోగ్యం కూడా ఇలాగే క్షీణించింది అని రాహుల్ గాంధీ అన్నట్లు రౌత్ ఉదహరించారు. ‘పాత్రా చాల్’ పునరాభివృద్ధి కుంభకోణం కేసులో ఈ సీనియర్ ఎంపీ 2022 ఆగస్టు 1 నుండి నవంబర్ 9 వరకు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో 101 రోజుల పాటు గడిపారు. ఆ తర్వాత ఆయన తన జైలు అనుభవాలను ‘నరకట్ల స్వర్గ’ (నరకంలో స్వర్గం) అనే తన జ్ఞాపకాల పుస్తకంలో పొందుపరిచారు.
