అమరావతి : ఇతరుల ఆకలిని తీర్చేందుకే చెట్లు ఫలాలను అందిస్తాయి. లోకంలోని సమస్త జీవరాశుల దాహాన్ని తీర్చేందుకే నదులు నిరంతరం ప్రవహిస్తాయి. సమస్త జీవకోటి పోషణ కోసమే ఆవులు సైతం అమృతం లాంటి పాలను అందిస్తాయి. అలాగే ఈ మానవ జన్మ స్వార్థం కోసం కాకుండా సమాజ ప్రయోజనం కోసమే ఉపయోగపడాలి అన్నది ధ్యేయంగా సేవా భారతి పని చేస్తోందని అన్నారు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవం కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సమయంలో ఈ సంస్థ 25 ఏళ్ళ ప్రస్థానాన్ని సింహావ లోకనం చేసుకునే అవకాశం కలిగిందని అన్నారు. ఒక్కసారి పాతికేళ్ళ వెనుకకు వెళ్ళి చూస్తే… ఏదో మాటల సందర్భంలో నా కుమార్తె దీపా వెంకట్ అడిగిన ఒక ప్రశ్న నుంచి ఉద్భవించిన ఆలోచనే స్వర్ణ భారత్ ట్రస్ట్ కు బీజం పడిందని చెప్పారు. సమాజానికి ఏదో చేయాలన్న ఆలోచన అక్కడే ఆగిపోకుండా 8 మంది మిత్రుల సహకారంతో స్వర్ణభారత్ స్వప్నం సాకారమైందన్నారు.
అంతకు ముందే నానాజీ దేశ్ ముఖ్ చిత్రకూట్ లో నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాల నుంచి ప్రేరణ పొందానని చెప్పారు ముప్పవరపు వెంకయ్య నాయుడు. గ్రామాల్లో భారతీయ ఆత్మ దాగి ఉందన్న మహాత్మ గాంధీ స్ఫూర్తిని మనసులో నిలుపుకున్నానని తెలిపారు. అయితే కారణాలు ఏవైనా ట్రస్ట్ స్థాపన కార్యరూపం దాల్చ లేదన్నారు. 2001లో మిత్రులతో కూర్చుని సంభాషిస్తున్న సమయంలో నా కుమార్తె చొరవతో నిలదీసినంత పని చేసింది. బాధ్యత వహించడానికి కూడా సిద్ధమైంది. అప్పుడు ఆమె వయసు 25 సంవత్సరాలు దాటాయి. మిగతా 8 మంది మిత్రులు మేము తోడుంటాం అని ముందుకు వచ్చారు. ఫలితంగా యువ ఉత్తేజం, పెద్దల ఆశీస్సులతో ట్రస్ట్ కు పునాది పడింది. అప్పటి ఉప ప్రధానమంత్రి, నాకు పితృ సమానులు లాల్ కృష్ణ అద్వానీ చేతుల మీద స్వర్ణభారత్ ట్రస్ట్ అనే అంత్యోదయ కల. నా మానస పుత్రికగా వాస్తవ రూపం దాల్చిందన్నారు.
స్వర్ణభారత్ ట్రస్ట్ ఆలోచన నాదే అయినా నా ప్రతి ఆలోచనను శరవేగంగా ముందుకు తీసుకు పోయిన చొరవ మాత్రం దీపమ్మదేనని చెప్పారు. మొదటి అడుగు నుంచి నేటివరకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం ఆశించకుండా “అంత్యోదయ” సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నాం అన్నారు. ఈ మహోన్నత యజ్ఞం విజయవంతంగా కొనసాగుతోందంటే దానికి కారణం మమ్మల్ని విశ్వసించిన శ్రేయోభిలాషులు, మా ఆశయాల్లో భాగస్వామ్యమైన వివిధ సంస్థలు, నిస్వార్థంగా చేయూత నందిస్తున్న ఉదార దాతలు, ప్రతి అడుగులో వెన్నంటే నిలుస్తున్న ఆత్మీయులు అన్నారు. ప్రజారోగ్య, విద్యా వికాసం, మహిళల సాధికారత, శిశు సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనలో సహకారం, మూగజీవాల సంక్షేమం, సంస్కృతి పరిరక్షణ ఇలా అనేక ఆశయాల సంగమంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ ముందుకు సాగుతోందన్నారు. రైతులు, మహిళలు, యువత అభివృద్ధి మీద స్వర్ణ భారత్ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఒక్క పూట అన్నం పెట్టడం కాదు, రోజూ అన్నం సంపాదించుకునే స్వశక్తిని పెంపొందించుకునే నైపుణ్య శిక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు మాజీ ఉప రాష్ట్రపతి.
ఇప్పటి వరకూ వేలాది మంది యువత స్వర్ణభారత్ లో నైపుణ్య శిక్షణ పొంది మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. అదే విధంగా ఎంతో మంది మహిళలు ఇక్కడ శిక్షణ పొంది, తమ కాళ్ళ మీద తాము నిలబడే సాధికారత సంపాదించారని పేర్కొన్నారు. మరెందరో రైతులు స్వర్ణభారత్ ట్రస్ట్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధిని సాధిస్తున్నారని అన్నారు. ఈ చొరవతో పాటు మన పండుగలను ఘనంగా నిర్వహించడం వంటివి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడు కోవడం దిశగా స్వర్ణభారత్ ట్రస్ట్ తీసుకున్న చొరవలో మరో కీలకమైనదని పేర్కొన్నారు. ఈ చొరవ నెల్లూరు నుంచి విజయవాడ, హైదరాబాద్ లకు కూడా విస్తరించిందని చెప్పారు వెంకయ్య నాయుడు. ముచ్చటగా మూడు చాప్టర్ ల ద్వారా స్వర్ణభారత్ ట్రస్ట్ తన సేవలను దేశానికి అందిస్తోందని అన్నారు. మా గ్రామానికి సేవ చేస్తే చాలు అనుకున్న ఆలోచన నుంచి దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు చెందిన యువత వచ్చి నైపుణ్య శిక్షణ పొందే వరకూ సాగడం వెనుక స్వర్ణభారత్ చేస్తున్న ఈ సేవా యజ్ఞాన్ని తమ సొంత బాధ్యతగా భావించి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియ జేస్తున్నానని అన్నారు మాజీ ఉప రాష్ట్రపతి.
2016లో ఒకరోజు దీపమ్మ నాకు ఫోన్ చేసింది. స్వర్ణభారత్ ట్రస్ట్ తరుఫున ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుంటున్నాను అని చెప్పింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం నిడుంపల్లికి మడితపు శివయ్య, బుజ్జమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు. మద్యానికి బానిసైన శివయ్య కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా.. కొంత కాలానికి భార్య బుజ్జమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న దీపమ్మ వారిని దత్తత తీసుకుని చదివించేందుకు సిద్ధమైందని అన్నారు. నేను సానుకూలంగానే స్పందించాను. ట్రస్ట్ అంటే సేవా కార్యక్రమాలే గానీ ఇలాంటి బాధ్యతను ఎలా నిర్వహిస్తుందా అని గమనిస్తూ వచ్చాను. నా అంచనాలకు మించి దీపమ్మ వారి ఆలనా పాలనా చూసుకుందని ప్రశంసించారు. వారిలో పెద్దమ్మాయి అయిన శిరీషకు 2023లో ఘనంగా పెళ్ళి కూడా జరిపించింది. ఆమె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. మిగిలిన ప్రసన్న, మల్లీశ్వరి, నందిని, లిజితలను చదివిస్తూ వారి బాగోగులు చూస్తోంది. వారికి వివాహాలు చేయడం కూడా తన బాధ్యతే అని ఆ రోజు ప్రకటించింది. అంతకంటే ముందు అదే విషయాన్ని నాకు కూడా చెప్పింది.
ఈ సందర్భం తర్వాత దీపమ్మకు స్వర్ణభారత్ ట్రస్ట్ అప్పజెప్పడం సరైనదే అనే సంతృప్తి ఆరోజే నాకు కలిగింది. నా నమ్మకాన్ని నిలబెట్టిన దీపమ్మకు ఈ సందర్భంగా అభినందనలు తెలియ జేస్తున్నాను.తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులను వారసత్వంగా ఇస్తారు. అందులో వారికి ఆనందం లభిస్తుంది. అయితే ఆస్తులు మాత్రమే కాదు మంచితనాన్ని, మానవత్వాన్ని, సమాజం పట్ల బాధ్యతను కూడా వారసత్వంగా అందించాలని అన్నారు. అప్పుడు మహదానందం కలుగుతుందన్నారు. ఈ ఆనందాన్ని స్వర్ణభారత్ ట్రస్ట్ 25 ఏళ్ళ ప్రస్థానం ద్వారా నేను పూర్తిగా ఆస్వాదించాను. మన అభివృద్ధికి బాసటగా నిలిచిన సమాజానికి, మనం పుట్టిన ఊరికి మేలు చేయాలనే తలంపుతో నా మనసులో ఉన్న స్వర్ణభారత్ ట్రస్ట్ ఆలోచనను, చొరవ తీసుకుని నా కుమార్తె దీపా వెంకట్ నా మిత్రుల సహకారంతో సాకారం చేసిందన్నారు. నా కుమారుడు హర్ష సైతం ముప్పవరపు ఫౌండేషన్ పేరుతో స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యక్రమాల్లో భాగస్వామి కావడం నా కోడలు రాధమ్మ సైతం ముప్పవరపు ఫౌండేషన్ బాధ్యత తీసుకోవడం నా జీవితంలో నన్ను నిజంగా ఆనందింప జేసిన అంశం. నా మనుమడు, మనుమరాళ్ళు సైతం ఈ సేవా కార్యక్రమాలకు తమ చేతనైన సాయం అందించడం నా ఆనందాన్ని రెట్టింపు చేసిందన్నారు ముప్పవరపు వెంకయ్య నాయుడు.
