శ్రీవారి సేవలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్

ఆలయ నిర్వహణపై టీటీడీకి ప్ర‌త్యేక‌ అభినందనలు

తిరుమల : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క‌లియుగ దైవ‌మైన‌ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమల విచ్చేసిన యోగి ఆదిత్యనాథ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి శ్రీవారి తీర్థ ప్రసాదాలను యూపీ సీఎంకు అందజేశారు.ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మీడియాతో మాట్లాడారు. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రార్థించి యావత్ దేశ ప్రజలకు స్వామి వారి కృపా కటాక్షాలు కలగాలని కోరుకున్నట్లు తెలిపారు.

తిరుమలలో టీటీడీ చేపడుతున్న సమర్థవంతమైన క్యూ లైన్ల నిర్వహణ, పరిశుభ్రత, ఆధ్యాత్మిక వాతావరణ పరిరక్షణను ఆయన అభినందించారు. పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీవారి ఆలయంలో కొలువైన శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామివారి ఉత్సవ మూర్తులను కూడా యూపీ సీఎం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగద్గురు శ్రీ రామానుజాచార్య సుమారు 1000 సంవత్సరాల క్రిందట తిరుమలలో ఏర్పాటు చేసిన వ్యవస్థ లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తో పాటు శ్రీరాముల వారి దివ్య రూపాన్ని కూడా తిరుమలలో నేడు దర్శించు కోవడం ఆనందదాయకమన్నారు. తిరుమల పెద్ద జియ్యర్ , చిన్న జియ్యర్ , ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు కూడా ఉన్నారు. కాగా ఏపీ మంత్రలు నారాయణ, సత్య కుమార్ యాదవ్, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి తదితరులు యూపీ సీఎం తిరుమల దర్శనం లో పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!