ప‌ద్మ‌శ్రీ గ్ర‌హీత హ‌రేక‌ళ హ‌జ‌బ్బ‌కు ‘స‌ర్’ నోటీస్

క‌ల‌క‌లం రేప‌డంతో నోటీస్ ఉప‌సంహ‌ర‌ణ

బెంగ‌ళూరు : పేరులో వ్యత్యాసం కారణంగా పద్మశ్రీ గ్రహీత హరేకళ హజబ్బకు స‌ర్ నోటీస్ జారీ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆ త‌ర్వాత త‌ప్పు తెలుసుకున్న ఎన్నిక‌ల అధికారులు జారీ చేసిన నోటీసును ఉప‌సంహ‌రించు కున్న‌ట్లు స‌మాచారం. 2002 నాటి ఓటర్ల జాబితాకు ప్రస్తుతం ఉన్న గుర్తింపు పత్రాలకు మధ్య పేరులో తేడా ఉండటంతో ఎన్నికల అధికారులు హజబ్బకు నోటీసు జారీ చేశారు. అయితే ఆయన పత్రాలను పరిశీలించిన తర్వాత ఆ నోటీసును ఉపసంహరించు కోవ‌డం చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. ఇదే తంతు దేశ వ్యాప్తంగా కొన‌సాగుతోంది. ఇక తెలంగాణ‌లో స‌ర్ ప్ర‌క్రియ దెబ్బ‌కు ఏకంగా కోటి మంది త‌మ ఓటు హ‌క్కు కోల్పోయే ప్ర‌మాదం నెల‌కొంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి వాపోయాడు. ఇక కర్ణాటకలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతుండగా, పేరులో వ్యత్యాసం కారణంగా పద్మశ్రీ గ్రహీత, విద్యా కార్యకర్త అయిన హరేకళ హజబ్బకు షాక్ త‌గిలింది స‌ర్ రూపంలో.

2002 నాటి ఓటర్ల జాబితాలో ఆయన పేరు కేవలం “హజబ్బ” అని ఉండగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి వంటి ప్రస్తుత పత్రాలలో “హరేకళ హజబ్బ” అని నమోదై ఉండటమే దీనికి కారణం. ఓటర్ల రికార్డుల పరిశీలనలో ఈ వ్యత్యాసం గుర్తించారు. దీనిని పరిష్కరించడానికి , తన గుర్తింపును ధృవీకరించడానికి, అసలు పత్రాలతో సెప్టెంబర్ 11న గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు హాజరు కావాలని కోరుతూ ఆయనకు నోటీసు పంపారు. ఈ నోటీసును ఒక అంగన్‌వాడీ కార్యకర్త ద్వారా హజబ్బకు అందజేశారు. తన పత్రాలను పరిశీలించిన తర్వాత ఈ సమస్య పరిష్కారమవుతుందని తనకు నమ్మకం ఉందని హజబ్బ పేర్కొన్నారు. పేరులో వ్యత్యాసం కారణంగానే ప్రముఖ పద్మశ్రీ గ్రహీతకు ఈ నోటీసు జారీ అయిందని గ్రహించిన ఎన్నికల అధికారులు, ఆ తర్వాత ఆయన నివాసాన్ని సందర్శించారు. వారు అవసరమైన పత్రాలను సేకరించి, ఆపై నోటీసును ఉపసంహరించుకున్నట్లు సమాచారం.

మంగళూరు సమీపంలోని హరేకళ గ్రామానికి చెందిన మాజీ పండ్ల విక్రేత అయిన హజబ్బ విద్యారంగానికి చేసిన కృషికి గాను విస్తృత గుర్తింపు పొందారు. ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ నారింజ పండ్ల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంతో తన సొంత గ్రామంలో ఒక పాఠశాలను స్థాపించి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు విద్యను అందించడంలో సహాయ పడ్డారు. సామాజిక సేవ, విద్యా రంగంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 2020లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన ‘పద్మశ్రీ’ అవార్డు లభించింది.

Leave A Reply

Your Email Id will not be published!