చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో టీవీకే సర్కార్ ఏర్పడి మూడు నెలలు కావస్తోంది. దీంతో ఇప్పుడు సీఎం విజయ్ పాలనకు మంచి మార్కులే ఉన్నప్పటికీ ఆయన తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. వచ్చే నెల అక్టోబర్ 6న రాష్ట్రంలోని రెండు శాసన సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఉప ఎన్నికలు ప్రభుత్వానికి ప్రత్యేకించి దళపతి విజయ్ కి అగ్నిపరీక్ష కానుంది. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు ఆ ప్రభుత్వానికి కీలకమైన తొలి ఎన్నికల పరీక్షగా నిలవనున్నాయి. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీలకు బలమైన ఆధిక్యత ఉండే సంప్రదాయం ఉన్నప్పటికీ, ప్రచార రంగంలోకి అడుగు పెడుతున్న టీవీకే మాత్రం కూటమిలోని విభేదాలు, దూకుడుగా ఉన్న ప్రతిపక్షం , క్లిష్టమైన శాసనసభ సంఖ్యాబలం వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. మధురాంతకం , ధరాపురం నియోజకవర్గాల్లో జరగనున్న ఈ కీలక పోరులో, ఏప్రిల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరిన మాజీ అన్నాడీఎంకే శాసన సభ్యులకు పార్టీ టిక్కెట్లు ఇస్తారా లేక టీవీకే తన విధేయులైన అభ్యర్థులను బరిలోకి దింపుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
మరగతం కుమారవేల్ , పి. సత్యభామ రాజీనామాలతో ఖాళీ అయిన మధురాంతకం , ధరాపురం స్థానాలకు భారత ఎన్నికల సంఘం ఉప ఎన్నికలను ప్రకటించింది. అన్నాడీఎంకేను వీడుతున్నట్లు ప్రకటించి, అసెంబ్లీ స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్‌కు రాజీనామా లేఖలు సమర్పించిన రోజే వీరిద్దరూ ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీలో చేరారు. మే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సాధారణ మెజారిటీ సాధించ లేక పోవడంతో కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్ , వామపక్ష పార్టీల మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పడింది. 22 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల క్రాస్-వోటింగ్ విజయ్ ప్రభుత్వానికి మొత్తం 144 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించేలా చేయడంలో సహాయ పడింది, తద్వారా ప్రభుత్వం విజయవంతంగా బలపరీక్షలో నెగ్గింది. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం 107 సీట్లు కలిగి ఉన్న టీవీకే 118 సీట్ల సాధారణ మెజారిటీ మార్కును దాటడానికి బయటి మద్దతుపై ఆధారపడి ఉంది.
టీవీకేలో విజయ్‌ను ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలనే డిమాండ్ పెరుగుతున్న తరుణంలో, తమ నాయకుడు రాహుల్ గాంధీని 2029 కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా అంగీకరించక పోతే మంత్రివర్గంలో భాగస్వామ్యాన్ని పునరాలోచిస్తామని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోంది. దీంతో టీవీకే అంతర్గత ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ధరల పెరుగుదలపై సీపీఐ నిరసనలు చేపట్టింది. సభ్యుల ఫిరాయింపుల వల్ల కోల్పోయిన సీట్లను తిరిగి దక్కించు కోవాలని ప్రయత్నిస్తున్న అన్నాడీఎంకేకు ఈ పోటీ అత్యంత వ్యక్తిగతమైనదిగా మారే అవకాశం ఉంది. టీవీకే విస్తరణను అడ్డుకోవడానికి ప్రారంభ దశలో ఉన్న పరిపాలనా పరమైన బలహీనతలను డీఎంకే తనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. శాసనసభలో తమ బలాన్ని పటిష్టం చేసుకోవడానికి , కూటమిలో వచ్చే అనిశ్చిత మార్పుల నుండి రక్షణ పొందడానికి ఈ రెండు సీట్లను గెలుచుకోవడం టీవీకేకు సంఖ్యా పరంగా చాలా కీలకం.
