హై-స్పీడ్ రైలు మార్గాల పనులను వేగవంతం చేయండి

కేంద్ర రైల్వే శాఖ మంత్రికి విన్న‌వించిన సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ: తెలంగాణ కోసం ప్రకటించిన హై-స్పీడ్ రైలు మార్గాల పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర‌ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ ను కోరారు. హైదరాబాద్ – పుణె, హైదరాబాద్ – బెంగళూరు , హైదరాబాద్ – చెన్నై కారిడార్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి, కొన్ని మార్పులతో తిరిగి కేంద్రానికి పంపిందని ఆయన తెలిపారు. ఈ మూడు కారిడార్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా భూసేకరణ ప్రక్రియను ప్రారంభించలేదని కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం అలైన్‌మెంట్‌ను (మార్గం ఖరారు) ఆమోదించిన తర్వాతే భూసేకరణ చేపడతామని స్పష్టం చేశారు. అలైన్‌మెంట్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు.

ఢిల్లీలోని రైల్ భవన్‌లో ముఖ్యమంత్రి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధికి అవసరమైన కీలక రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. కొత్తగా ప్రతిపాదించిన వికారాబాద్ – కృష్ణ రైల్వే మార్గానికి (130 కి.మీ) తక్షణమే ఆమోదం తెలపాలని కోరారు.
వికారాబాద్ జిల్లాలోని టేకల్‌కోడ్ పరిసర ప్రాంతాల్లో భారీగా సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతాన్ని సిమెంట్ , టెక్స్‌టైల్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని కేంద్ర మంత్రికి తెలియజేశారు.

హైదరాబాద్ చుట్టూ సుమారు 360 కి.మీ మేర నిర్మిస్తున్న ‘రీజినల్ రింగ్ రోడ్డు’ మార్గంతో పాటే ‘రీజినల్ రింగ్ రైలు’ మార్గాన్ని కూడా ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. డోర్నకల్ – గద్వాల్, కల్వకుర్తి – మాచర్ల, కాచిగూడ – జగ్గయ్యపేట (250 కి.మీ), పటాన్‌చెరు – ఆదిలాబాద్ (320 కి.మీ), బోధన్ – లాతూర్ (175 కి.మీ) , అక్కన్నపేట బైపాస్ లైన్ (8 కి.మీ) మార్గాలకు తక్షణమే ఆమోదం తెలపాలని ఆయన మరోసారి కోరారు.

మహబూబాబాద్ జిల్లాలోని అనంతారం గ్రామం సమీపంలో, దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదించిన మెగా కోచింగ్ , ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపోను ఏర్పాటు చేయాలని అశ్విని వైష్ణవ్‌ను ముఖ్యమంత్రి కోరారు. ✅ ఈ డిపో కోసం అవసరమైన 409.1 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించేందుకు ఇప్పటికే అనుమతి మంజూరైందని గుర్తు చేస్తూ, మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపోకు సంబంధించిన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని విన్న‌వించారు.

Leave A Reply

Your Email Id will not be published!