ఓబీసీల కోసం త‌మిళ‌నాడు అసెంబ్లీలో కీల‌క తీర్మానం

జ‌నాభా లెక్క‌ల్లో ఓబీసీల పేర్లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి

చెన్నై : జనాభా లెక్కల్లో ఓబీసీల‌ అధికారిక పేర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. దీనికి ఆయా పార్టీల స‌భ్యులంతా మ‌ద్ద‌తు ఇచ్చారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి వి. సంపత్‌కుమార్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారతదేశంలో జనాభా లెక్కల చరిత్రను క్లుప్తంగా వివరించారు. 2027 జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా ఓబీసీల‌కు సంబంధించిన వివరాలను సేకరించేటప్పుడు ఆయా కులాలను నిర్దిష్టంగా గుర్తించే రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాల అధికారిక జాబితాల ఆధారంగా మాత్రమే సమాచారాన్ని సేకరించాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఒకే కులాన్ని సూచించడానికి ప్రాంతీయ భేదాలతో సహా ప్రజలు వేర్వేరు పేర్లను ఉపయోగిస్తే, సేకరించిన డేటా అస్పష్టంగా మారే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. దీనివల్ల గణన ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తవచ్చు అని అన్నారు. జనాభా లెక్కల ద్వారా లభించే పూర్తి ప్రయోజనాలను పొందడం సాధ్యం కాకపోవచ్చు అని అభిప్రాయ‌ప‌డ్డారు.

కాబట్టి సామాజిక న్యాయం, సమాన న్యాయాన్ని కల్పించేందుకు రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాల నోటిఫికేషన్ల ప్రకారం అధికారిక పేర్లను మాత్రమే ఈ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోవాలి అని ఆయన అన్నారు. రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు గుర్తించిన వెనుకబడిన తరగతులు , అత్యంత వెనుకబడిన తరగతులు , డీ-నోటిఫైడ్ కమ్యూనిటీల వివరాలను జనాభా లెక్కల గణన పోర్టల్ లేదా అప్లికేషన్‌లో ముందుగానే పొందుపరచాలని ఆయన సూచించారు. ముందుగా పొందుపరిచిన డేటా నుండి ‘డ్రాప్-డౌన్ మెనూ’ ద్వారా కులాన్ని ఎంచుకోవడం సరైన పద్ధతి అని మంత్రి పేర్కొన్నారు. అధికారిక జాబితాల్లో ఉన్న పేర్ల ఆధారంగా మాత్రమే డేటాను సేకరించాలని కోరారు. గణన కోసం అస్పష్టమైన ఓపెన్-కాలమ్ పద్ధతి ని పూర్తిగా విరమించు కోవాలని తీర్మానం స్పష్టం చేసింది. సమాజంలోని అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేకూరేలా చూసేందుకు షెడ్యూల్డ్ కులాలు , షెడ్యూల్డ్ తెగల విషయంలో అనుసరించిన విధానాన్ని అనుసరించే 2027 భారత జనాభా లెక్కల రెండవ దశలో వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు , డీ-నోటిఫైడ్ కమ్యూనిటీల కుల వివరాలను సేకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానిస్తోంది అని అందులో పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!