స్పీక‌ర్ పై ఎమ్మెల్సీల కామెంట్స్ దారుణం

నిప్పులు చెరిగిన ఏఐసీసీ కార్య‌ద‌ర్శి

న్యూఢిల్లీ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మ‌ధు, న‌వీన్ కుమార్ రెడ్డిలు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ను దూషించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ఏఐసీసీ కార్య‌ద‌ర్శి , తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ స‌చిన్ సావంత్. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. స్పీకర్‌పై ఎమ్మెల్సీలు దుర్భాష‌లాడ‌డం ఆ పార్టీకి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల‌తో ఉన్న మ‌నువాద భావ‌జాలాన్ని ప్ర‌తిబింబిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలానికి ఇటువంటి ఆలోచనా విధానం విరుద్ధమని పేర్కొన్నారు ఏఐసీసీ కార్యదర్శి. తెలంగాణ ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. స్పీకర్‌పై వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయ‌డాన్ని స‌చిన్ సావంత్ స్వాగ‌తించారు. ఈ సంద‌ర్బంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక బాధ్య‌త క‌లిగిన ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌లో ఉన్న వారు ఇంత‌లా దిగ‌జారి మాట్లాడ‌టం దారుణ‌మ‌న్నారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

ప్ర‌జ‌ల‌కు, స‌భ్య స‌మాజానికి ఏం సందేశం ఇవ్వాల‌ని అనుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌లు వీరి భాష‌ను, హావ‌భావాల‌ను , చేసిన నిర్వాకాన్ని చూసి త‌ల‌దించుకుంటున్నార‌ని అన్నారు. ఈ సంఘటనతో దేశం ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యానికి లోనైంద‌ని అన్నారు. డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలానికి ఈ ఆలోచనా విధానం విరుద్ధం కాబట్టి, తెలంగాణ ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు స‌చిన్ సావంత్. మల్లికార్జున్ ఖర్గే ప్రసంగం తర్వాత ‘శుద్ధి’ కార్యక్రమం జరగాలని కోరిన ఆలోచనా విధానం కూడా ఇదేన‌ని అన్నారు. స్పీకర్ దళితుడు అయినంత మాత్రాన ఆయనను దూషించే హక్కు మీకు ఉందని భావిస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. ఈ ఆలోచనా విధానాన్ని తాము పూర్తిగా వ్య‌తిరేకిస్తున్నామ‌ని, ఖండిస్తున్నామ‌ని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!