బీఆర్ఎస్ ఎమ్మెల్సీల తీరుపై అసెంబ్లీలో తీర్మానం

బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని స‌భ్యుల డిమాండ్

హైద‌రాబాద్ : తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సభ్యులు తాతా మధుసూదన్, ఎన్. నవీన్ కుమార్ రెడ్డి శాసనసభ ప్రాంగణంలోని గేట్ నంబర్ 3 సమీపంలో శాసన సభాపతి గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ని ఉద్దేశించి అత్యంత అవమానకరంగా, కించ పరిచేలా చేసిన దూషణలను ఈ సభ తీవ్రంగా ఖండిస్తుందని ప్ర‌క‌టించింది. సభా మర్యాదలకు విరుద్ధమైన వ్యాఖ్యలపై నిరసన నమోదు చేస్తోందని పేర్కొంది . ఈ ఇద్దరు సభ్యులు మహిళల ఎదుట చొక్కాలు విప్పి అనుచితంగా, అసభ్యకరంగా, సమాజం తల దించుకునేలా ప్రవర్తించడాన్ని కూడా ఈ సభ తీవ్రంగా ఖండిస్తోంది.

ఇటువంటి ప్రవర్తన శాసన మండలి సభ్యుని హోదాకు ఏమాత్రం తగదని, శాసన సభాపతి గౌరవం, అధికారం రాజ్యాంగబద్ధ హోదాకు తీవ్ర భంగం కలిగించిందని ఈ సభ భావిస్తోంది. ఇది తెలంగాణ శాసనసభ గౌరవం, సభా హక్కులు, సంస్థాగత సమగ్రతకు విఘాతం కలిగించే చర్యగా ఈ సభ పరిగణిస్తోంది. రాజకీయ విభేదాలు, వ్యక్తిగత అభ్యంతరాలు, భిన్నాభిప్రాయాలు ఏవైనా సరే, సభాపతి హోదాలో ఉన్న వ్యక్తి గౌరవాన్ని, అధికారాన్ని తగ్గించే ఉద్దేశంతో సభ్యులు ప్రవర్తించడాన్ని సమర్థించబోమని ఈ సభ స్పష్టం చేస్తోంది. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించటాన్ని సహించేది లేదని సభ అభిప్రాయ పడుతుంద‌ని పేర్కొంది.

తమ పార్టీ సభ్యుల అనుచిత ప్రవర్తనకు ప్రతిపక్ష నేత , మాజీ సీఎం కె. చంద్రశేఖర్ రావు బాధ్యత స్వీకరించి ఈ సభ హుందాతనం, సభా మర్యాదలను పరిరక్షించేందుకు శాసన సభాపతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సభ తీర్మానిస్తోంది. అదే విధంగా, తాతా మధుసూదన్, ఎన్. నవీన్ కుమార్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఉన్నందున, ఈ తీర్మానం ప్రతితో పాటుసభ ముందు ఉంచిన ఆధారాలు, సభా హక్కుల ఉల్లంఘన నోటీసు, వాటికి సంబంధించిన కార్యకలాపాల వివరాలను తెలంగాణ శాసనమండలి చైర్మన్‌కు పంపించాలని ఈ సభ తీర్మానిస్తోందని స్ప‌ష్టం చేసింది.

Leave A Reply

Your Email Id will not be published!