హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా, వృత్తి అవకాశాలను మైనారిటీ విద్యార్థులు, యువత అభిరుచి, కృషి, క్రమశిక్షణ, పట్టుదలతో సద్వినియోగం చేసుకుని విజయం సాధించాలని మైనారిటీ సంక్షేమ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పిలుపునిచ్చారు. ఇందిరా ప్రియదర్శిని జూనియర్ కళాశాలలో ప్రభుత్వ మైనారిటీ స్టడీ సర్కిల్ , కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా అజారుద్దీన్ మాట్లాడారు. విద్య, పోటీ పరీక్షల సన్నద్ధత, వృత్తి మార్గదర్శనం ద్వారా మైనారిటీ యువతకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఈ నూతన కేంద్రం ఒక ముఖ్యమైన చొరవ అని అభివర్ణించారు. ఈ కేంద్రాన్ని పూర్తి చేయడంలో మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, ముఖ్యంగా డైరెక్టర్ తారిక్ అన్వర్ చేసిన కృషిని అభినందించారు. ప్రభుత్వం అవసరమైన సౌకర్యాలు, అవకాశాలను కల్పించిందని, వాటిని సమర్థవంతంగా ఉపయోగించు కోవడం ఇప్పుడు విద్యార్థుల బాధ్యత అని మంత్రి అన్నారు. ఏదీ ఉచితంగా రాదు. ఇప్పుడు మీకు అన్నీ సమకూర్చబడ్డాయి కాబట్టి, మీరు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని జీవితంలో ముందుకు సాగాలని, దానికి కావలసిన మూల్యాన్ని మీరు మీ కష్టంతోనే చెల్లించాలి అని అజారుద్దీన్ అన్నారు. విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో అభిరుచిని పెంచుకోవాలని, తమ లక్ష్యాలకు కట్టుబడి ఉండాలని మంత్రి నొక్కి చెప్పారు. అభిరుచితో కూడిన చిత్తశుద్ధి గల కృషి ఎల్లప్పుడూ ఫలితాలనిస్తుందని, కేంద్రంలోని సౌకర్యాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
మైనారిటీ వర్గాల విద్యాభివృద్ధికి, సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఎంతగానో కట్టుబడి ఉన్నారని, మైనారిటీ యువతకు మెరుగైన అవకాశాలు కల్పించాలనే స్పష్టమైన దార్శనికత ఆయనకు ఉందని అజారుద్దీన్ అన్నారు. సూచనలను స్వీకరించే ముఖ్యమంత్రి నిష్కాపట్యాన్ని, విద్యా అవకాశాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకునే ఆయన సంసిద్ధతను ప్రశంసించారు. సంకోచం లేకుండా ప్రశ్నలు అడగాలని విద్యార్థులను ప్రోత్సహిస్తూ నేర్చుకోవడంలో ప్రశ్నించడం ఒక ముఖ్యమైన భాగమని అజారుద్దీన్ అన్నారు. తన క్రికెట్ కెరీర్‌ను గుర్తు చేసుకుంటూ, భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పుడు తన కెప్టెన్ సునీల్ గవాస్కర్‌ను క్రమం తప్పకుండా ప్రశ్నలు అడిగి, మార్గదర్శకత్వం కోరే వాడినని, అది తనకు నేర్చుకోవడానికి, మెరుగు పడటానికి సహాయ పడిందని ఆయన చెప్పారు.ముఖ్యంగా బాలికలు విద్య, ఉద్యోగాలలో తమ భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవాలని ప్రోత్సహించారు. అలాగే బాలురు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఏకాగ్రతతో ఉండాలని, తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సలహా ఇచ్చారు. నిజాం కళాశాలలో తన విద్యార్థి రోజులను గుర్తుచే సుకుంటూ, పరిమిత సౌకర్యాలు ఉన్నప్పటికీ తన ఇద్దరు స్నేహితులు ఒక చెట్టు కింద చదువుకోవడం చూశానని అజారుద్దీన్ చెప్పారు. వారిద్దరూ ఆ తర్వాత తమ తమ జీవితాలలో విజయం సాధించారన్నారు. పరిస్థితుల కన్నా నిబద్ధత, కఠోర శ్రమలే ముఖ్యమని వారి దృఢ సంకల్పం నిరూపించిందని ఆయన అన్నారు.
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. మైనారిటీ యువత సాధికారతకు విద్య, జ్ఞానం అత్యవసరమని ఆయన అన్నారు. అవకాశాలను విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, రిజర్వేషన్ల చర్యల గురించి కూడా ఆయన మాట్లాడారు.TMREIS అధ్యక్షుడు ఫహీమ్ ఖురేషి మాట్లాడుతూ ఈ కొత్త కేంద్రాన్ని మైనారిటీ యువతకు ఒక ప్రధాన మైలురాయిగా అభివర్ణించారు. దీనిని త్వరగా పూర్తి చేయడానికి మంత్రి అజారుద్దీన్ ముఖ్యమంత్రితో, వివిధ శాఖలతో నిరంతరం సంప్రదింపులు జరపడాన్ని, చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. విద్యార్థులు ఈ సౌకర్యాలను గరిష్టంగా ఉపయోగించు కోవాలని ఆయన కోరారు.
