అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరునూ వినియోగించాలి

ఎల్-నినోను ఎదుర్కొనేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు

అమరావతి : రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని, తేమ ఒత్తిడికి గురవుతున్న పంటలను కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్-నినో పరిస్థితులు, వర్షపాతం, ఖరీఫ్ సాగు, పంటలపై ప్రభావం, పంట ఆరోగ్య పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల సాగు, అందుబాటులో ఉన్న నీటి వనరులతో పంటలను కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తేమ ఒత్తిడికి గురైన ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరునూ సద్వినియోగం చేసుకుని పంటలను కాపాడేందుకు రక్షక తడులు అందించాలని వ్యవసాయ, జలవనరుల శాఖల అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, అవసరమైన చోట తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 12 వరకు సాధారణంగా 476.1 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 218.2 మి.మీ. మాత్రమే నమోదైందని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 54.2 శాతం వర్షపాతం లోటు నమోదైందన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వర్షాభావ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఖరీఫ్-2026లో సెప్టెంబర్ 12 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 26.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయని తెలిపారు. ఇది సాధారణ సాగు విస్తీర్ణంలో 74 శాతం కాగా, గత ఏడాది ఇదే తేదీ నాటి సాగుతో పోలిస్తే 78 శాతంగా ఉందన్నారు. ప్రధాన పంటల్లో వరి 12.01 లక్షల హెక్టార్లు, పత్తి 4.11 లక్షల హెక్టార్లు, కంది 2.63 లక్షల హెక్టార్లు, వేరుశనగ 1.47 లక్షల హెక్టార్లు, మొక్కజొన్న 1.08 లక్షల హెక్టార్లలో సాగైనట్లు వివరించారు.

ఎల్-నినో ప్రభావంతో రాష్ట్రంలోని 284 మండలాలు, 1,792 ఆర్‌ఎస్‌కేలు/గ్రామాల పరిధిలో పంటలపై ప్రభావం నమోదైనట్లు వెల్లడించారు. మొత్తం 2,44,443 హెక్టార్లలో పంటలు వివిధ స్థాయుల్లో ప్రభావితమైనట్లు తెలిపారు. ఇందులో 1,92,387 హెక్టార్లలో తేమ ఒత్తిడి, 41,474 హెక్టార్లలో పంటలు వాడిపోవడం, మరో 10,582 హెక్టార్లలో పంటలు ఎండిపోవడం నమోదైనట్లు వివరించారు. ఈ పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ తేమ ఒత్తిడిలో ఉన్న పంటలను సాధ్యమైనంత వరకు కాపాడటమే ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు ఎప్పటికప్పుడు అందించాలని, అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.

జిల్లాల వారీగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,09,255 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 80,751 హెక్టార్లు, అనంతపురం జిల్లాలో 32,456 హెక్టార్లలో పంటలు ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు. ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వ్యవసాయ, జలవనరుల శాఖల అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని మంత్రి ఆదేశించారు. పంటల వారీగా కంది 74,301 హెక్టార్లు, పత్తి 73,733 హెక్టార్లు, వేరుశనగ 25,818 హెక్టార్లు, మొక్కజొన్న 24,819 హెక్టార్లు, వరి 18,443 హెక్టార్లలో ప్రభావితమైనట్లు సమావేశంలో వివరించారు.

Leave A Reply

Your Email Id will not be published!