తిరుపతి ! శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశించారు. బందోబస్తు విధుల నిమిత్తం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తిరుమలకు వచ్చిన సుమారు 2,000 మంది పోలీసు సిబ్బందికి విధులు నిర్వహించాల్సిన ప్రాంతాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో స్పాట్ బ్రీఫింగ్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలు, భక్తుల రద్దీ నిర్వహణ, విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై సిబ్బందికి వివరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ప్రతి పోలీసు సిబ్బంది అప్రమత్తత, క్రమశిక్షణ, సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
బ్రహ్మోత్సవాల సమయంలో పోలీసు సిబ్బంది వ్యక్తిగత ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించ రాదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ స్వయం నియంత్రణ, సహనం, సంయమనం, మర్యాదతో వ్యవహరిస్తూ సేవా భావంతో విధులు నిర్వహించాలని అన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద కదలికలు, వస్తువులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగ భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందిస్తూ, సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
