అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిలో మొత్తం 119 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో 97 ఇప్పటికే కొనసాగుతున్నాయని, ఆ పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అమరావతిలో జరుగుతున్న రాజధాని నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రజల రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని అన్నారు. ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, నిధుల సమీకరణ , భూ కేటాయింపులు వేగంగా సాగుతున్నాయి. అమరావతి రాజధానిపై తరచుగా సమీక్షా సమావేశాలు నిర్వహించిన నాయుడు, ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అమరావతి కోసం ప్రతిపాదించిన 119 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో 113 ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయి. వీటిలో 97 ప్రాజెక్టుల పనులు ప్రారంభం కాగా, 4 ప్రాజెక్టులు పూర్తయ్యాయి ..
ఇదిలా ఉండగా 93 ప్రాజెక్టులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. అమరావతి అంతటా సమానమైన అభివృద్ధిని సాధించేందుకు, రాజధాని పరిధిలోని 29 గ్రామాలను నగర స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. రోడ్లు, భూగర్భ డ్రైనేజీ , తాగునీటి సరఫరా కల్పన కోసం సుమారు రూ. 904 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణ పనులు ఆలస్యం కావడం వల్ల వ్యయం దాదాపు 25 శాతం పెరిగిందని సీఎం పేర్కొన్నారు. నిధుల విషయానికొస్తే, ప్రపంచ బ్యాంక్, హడ్కో, నాబార్డ్ , నాబ్‌ఫిడ్ , ఏపీపీఎఫ్‌సీ ద్వారా రూ. 41,187.70 కోట్ల రుణాలు సమీకరించినట్లు ఆయన తెలిపారు. 2024 నుండి రాజధాని పనుల కోసం రూ. 12,731.13 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం 119 ప్రాజెక్టులకు అయ్యే వ్యయం రూ. 66,802 కోట్లుగా అంచనా వేయబడగా, ప్రస్తుతం జరుగుతున్న పనులకు రూ. 58,093 కోట్లు ఖర్చవుతున్నాయి.
అమరావతి నిర్మాణానికి రైతులు చేసిన త్యాగాలను కొనియాడుతూ భూ సమీకరణ పథకం కింద రైతులకు తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్లలో 98 శాతం ఇప్పటికే కేటాయించినట్లు నాయుడు తెలిపారు. సుమారు 30,173 మంది రైతులకు 71,299 ప్లాట్లు (తిరిగి ఇచ్చేవి) పంపిణీ చేయబడ్డాయి . ప్రస్తుతం ఈ ప్లాట్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 2014 నుండి రైతులకు కౌలు చెల్లింపుల రూపంలో రూ. 2,248.02 కోట్లు అందాయి. రాజధాని అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రధాన ప్రభుత్వ భవనాలు, అనుబంధ మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని చేపడుతూ, అమరావతిని రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది అని నాయుడు పేర్కొన్నారు.
