తిరుమల : టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలను సందర్శించే భక్తులకు ఉచిత జీవిత బీమా సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ బీమా సౌకర్యం ఇప్పటికే ఉన్న ప్రమాద బీమా సహాయానికి అదనంగా ఉంటుంది. తిరుమల యాత్రలో సహజ కారణాలతో మరణించే భక్తులకు ఈ బీమా వర్తిస్తుంది. తిరుమలలో జరిగిన ట్రస్ట్ బోర్డు సమావేశంలో చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బి.ఆర్. నాయుడు) ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. దేశంలోని ఆలయ ట్రస్టులలో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. తిరుమల యాత్రకు సంబంధించిన వివిధ ప్రమాదాలను/సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ బీమా పథకాన్ని ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. ఈ బీమాకు సంబంధించిన ప్రీమియంను టీటీడీయే భరిస్తుంది అని చెప్పారు. దీని కింద తిరుమలలో సహజ కారణాలతో మరణించిన భక్తుని కుటుంబానికి ₹2 లక్షలు అందుతాయి. ప్రస్తుతం అలిపిరి , తిరుమల మధ్య నిర్దిష్ట పరిస్థితులలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణించిన భక్తుల కుటుంబ సభ్యులకు టీటీడీ ప్రమాద బీమా సహాయాన్ని అందిస్తోంది.
ప్రమాదవశాత్తు మరణించే భక్తులకు ఇచ్చే బీమా పరిహారాన్ని ₹3 లక్షల నుండి ₹10 లక్షలకు పెంచాలని కూడా టీటీడీ బోర్డు నిర్ణయించింది. అలాగే ఓపీఎస్ పెన్షనర్లకు లభించే విధంగానే, పదవీ విరమణ పొందిన సీపీఎస్, ఎన్పీఎస్ పెన్షనర్లు , వారి కుటుంబాలకు కూడా ‘ఎంప్లాయీ హెల్త్ ఫెసిలిటీ’ ప్రయోజనాలను వర్తింపజేయాలని నిర్ణయించింది. తిరుమలలోని అన్నప్రసాదం కాంప్లెక్స్, క్యాంటీన్లు , హోటళ్లలో ఉత్పన్నమయ్యే ఆహార వ్యర్థాలను ప్రాసెస్ చేయడానికి బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపిందని చైర్మన్ తెలిపారు. వ్యర్థాలను వేరు చేసిన తర్వాత ‘వాటర్ హైడ్రాలిసిస్’ పద్ధతి ద్వారా బయోగాస్ను ఉత్పత్తి చేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ముందుకు వచ్చిందని చెప్పారు బీఆర్ నాయుడు.
ఈ బయోగాస్ను అన్నప్రసాదం వంటశాల సముదాయానికి సరఫరా చేస్తారని తెలిపారు. ఈ ప్లాంట్ నిర్వహణ బాధ్యతను ₹2.80 కోట్ల వ్యయంతో జీపీఎస్ రెన్యూవబుల్స్ సంస్థకు అప్పగించనున్నారు. తిరుమల పోటులో శ్రీవారి లడ్డూల తయారీని వేగవంతం చేసేందుకు అదనంగా 400 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించు కునేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని బోర్డు నిర్ణయించింది. వివిధ టీటీడీ విభాగాల్లో పనిచేస్తున్న 48 మంది ఉద్యోగుల వేతనాలను పెంచాలని కూడా నిర్ణయించారు. అదనపు పారిశుధ్య సిబ్బందికి రవాణా భత్యం కోసం మూడేళ్ల కాలానికి ₹1.60 కోట్ల వ్యయానికి ఆమోదం తెలిపారు. నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని అమ్మవారి పీఠానికి, అలాగే చెన్నైలోని పద్మావతి అమ్మవారి ఆలయంలోని ధ్వజస్తంభం , బలిపీఠానికి బంగారు పూత పనులు చేపట్టేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని బి.ఆర్. నాయుడు తెలిపారు. తిరుపతిలోని తెలుగు , సంస్కృత అకాడమీకి కేటాయించిన టీటీడీ భవనం లైసెన్స్ గడువును మరో మూడేళ్లు పొడిగించినట్లు చైర్మన్ వెల్లడించారు.
