చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన‌ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

అమరావతి : మూడేళ్ల క్రితం అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులతో అరెస్టు చేసి 53 రోజుల పాటు నిర్బంధించడం ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సెప్టెంబర్ 9వ తేదీ తెలుగుజాతి చరిత్రలో ఎన్నటికీ మరచి పోలేని రోజని పేర్కొన్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు కొవ్వొత్తులు వెలిగించి, ఆనాటి ఘటనలను గుర్తు చేసుకుంటూ న్యాయం గెలిచింది.. సత్యం నిలిచింది అనే సందేశాన్ని ప్రజలకు అందించారు. రాజకీయ కక్షసాధింపుతో చంద్రబాబు నాయుడిపై పన్నిన కుట్రలు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని అడ్డుకోలేక పోయాయని మంత్రి అన్నారు. ఒక ప్రజా నాయకుడిని జైలులో నిర్బంధించ గలిగారు కానీ, ప్రజల గుండెల్లో ఆయనకు ఉన్న స్థానాన్ని మాత్రం ఎవరూ నిర్బంధించలేక పోయారని పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో రాష్ట్రంలోనే కాకుండా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు సైతం తీవ్రంగా స్పందించారని అచ్చెన్నాయుడు అన్నారు. 53 రోజుల పాటు చంద్రబాబు విడుదల కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, ఎన్‌ఆర్‌ఐలు చేసిన పోరాటం, సంఘీభావాన్ని ఎన్నటికీ మరువలేమని అన్నారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని రాజకీయ కక్షలు, కుట్రలు, నిర్బంధాలు ఎదురైనా చంద్రబాబు నాయుడు ప్రజల పక్షాన నిలిచారని అన్నారు. ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం, రాష్ట్ర అభివృద్ధికి అందించిన సేవలు ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేశాయని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడిని రాజకీయంగా దెబ్బ తీయాలనే ప్రయత్నాలే చివరకు వైసీపీ పతనానికి నాంది పలికాయని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, ప్రజల తీర్పు ముందు ఎలాంటి కుట్రలు, కక్షసాధింపులు నిలబడవని మరోసారి రుజువైందన్నారు. చింత చచ్చినా పులుపు చావనట్లు ప్రజలు గుణపాఠం చెప్పినా జగన్‌ బుద్ధి మారడం లేదు అని మంత్రి విమర్శించారు.

Leave A Reply

Your Email Id will not be published!