హైదరాబాద్ : తెలంగాణ సమాచార కమిషన్ (టీజీఐసీ), సమాచార హక్కు చట్టం అమలులో కార్యాచరణ ఏకరూపత: సవాళ్లు – పరిష్కారాలు అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును 10, 11 తేదీలలో హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ)లో నిర్వహిస్తోంది. ఈ సదస్సును నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఇన్ ఇండియా (ఎన్‌ఎఫ్‌ఐసీఐ) ప్రాయోజితం చేయగా, ఏఎస్‌సీఐ సహకారంతో నిర్వహిస్తున్నారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య సమాచార కమిషనర్లు, సమాచార కమిషనర్లు, న్యాయ నిపుణులు, విధాన రూపకర్తలు , ఉన్నత స్థాయి అధికారులు పాల్గొంటారు. సుమారు 20 మంది రాష్ట్రాల ముఖ్య సమాచార కమిషనర్లు, వీరిలో చాలామంది మాజీ ప్రధాన కార్యదర్శులు, ఐఏఎస్ , ఐపీఎస్ ఉన్నతాధికారులు, అలాగే ప్రముఖ న్యాయ నిపుణులు, విధాన రూపకర్తలు , ఉన్నత స్థాయి అధికారులు పాల్గొంటారని అంచనా.
ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై, కీలకోపన్యాసం చేయడానికి తెలంగాణ గవర్నర్ గారు దయతో అంగీకరించారని ఆర్టీఐ చీఫ్ కమిషనర్ తెలిపారు. ఈ సదస్సు, అనుభవాలను పంచుకోవడానికి, ఎదురవుతున్న సవాళ్లను పరిశీలించడానికి, సమాచార హక్కు చట్టం- 2005 అమలును బలోపేతం చేసే చర్యలపై చర్చించడానికి ఒక జాతీయ వేదికను అందిస్తుందన్నారు. సమాచార కమిషన్ల పనితీరులో మరింత స్థిరత్వం, సామర్థ్యం, పారదర్శకత మ, ఊహాజనితతను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. అదే సమయంలో, ప్రతి కేసు దాని వాస్తవాల ఆధారంగా , చట్ట నిబంధనలకు అనుగుణంగా పరిశీలించ బడుతుందని నిర్ధారించడం కూడా దీని ఉద్దేశ్యం అన్నారు.
