మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రూ. 800 కోట్లు

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : రైతు పండించిన పంటకు మార్కెట్‌లో కనీస మద్దతు ధర కంటే తక్కువ ధర లభించి నష్టపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు, రైతుకు అండగా నిలిచి ధరకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం మార్కెట్‌లో జోక్యం చేసుకోవడమే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్ప‌ష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పేరుతో పెద్దగా ప్రయోజనం కల్పించక పోయినా, భారీగా నిధులు ఖర్చు చేసినట్లు ప్రచారం చేసుకున్నారని మంత్రి విమర్శించారు. బడ్జెట్‌లో కేటాయింపులు చూపించడం, వాస్తవంగా రైతులకు నిధులు అందించడం మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఎద్దేవా చేశారు. రైతుల పంటలకు ధరలు పడి పోయినప్పుడు జగన్ ప్రభుత్వం ఎక్కడ ఉంది? రైతులకు ఎంత సాయం చేసింది? అని మంత్రి ప్రశ్నించారు.2025–26 ఆర్థిక సంవత్సరానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం రైతును ఆదుకునేందుకు చిత్త‌శుద్ధితో ప‌నిచేసింద‌ని మంత్రి తెలిపారు. వివిధ పంటలకు మద్దతు ధరల కోసం సుమారు రూ.800 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

అందులో భాగంగా పొగాకుకు రూ.271 కోట్లు, మామిడికి రూ.261 కోట్లు, ఉల్లికి రూ.125 కోట్లు, కోకోకు రూ.14 కోట్లు, టమాటా కు రూ.12 కోట్లు ఖ‌ర్చు చేసామ‌ని తెలిపారు. ఈ ఏడాది కూడా తోతాపూరి మామిడి, పొగాకు రైతుల‌కు అండ‌గా నిలిచామ‌ని వెల్ల‌డించారు. మార్కెట్‌లో తోతాపురి మామిడి ధరలు పడిపోవడంతో రైతులకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం కిలోకు రూ.4 చొప్పున ధర లోటు భర్తీ చేసిందని చెప్పారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లోని రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం క‌ల్పించామ‌ని అన్నారు. మొత్తం 7.03 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తికి కిలోకు రూ.4 చొప్పున ధర లోటు చెల్లింపు చేసిన‌ట్లు మంత్రి వివరించారు. ఆఫ్-స్టైల్, లో-గ్రేడ్ పొగాకు రకాలను సాగు చేస్తున్న రైతులను ఆదుకునేందుకు కిలోకు రూ.10 చొప్పున ప్రోత్సాహకం అందించామ‌ని మంత్రి తెలిపారు. మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్న వేలాది మంది పొగాకు రైతులకు ఈ నిర్ణయం గణనీయమైన ఆర్థిక ప్రయోజనం కల్పిస్తుందని మంత్రి పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!