జనవరి 1 నుంచి హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్

డబులింజన్ ప్రభుత్వంతో వైద్యారోగ్య రంగానికి కొత్త ఊపు

విజయవాడ : వైద్యారోగ్య రంగంలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని అమలు చేయనున్నామని, వైద్యరంగంలో ఇది గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని చెప్పారు. జనవరి 1 నుంచి ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్‌ చేస్తున్నామని తెలిపారు. అమరావతిలో ఏర్పాటు చేయబోతున్న క్వాంటం బయో వ్యాలీని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ బ్లాక్, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటీలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు సందర్శించి.. కొత్తగా నిర్మించిన బ్లాక్, ల్యాబరేటరీని ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ కళా వేదికలో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.249 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 10 క్రిటికల్‌ కేర్‌ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబరేటరీలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ గా లాంఛ్ చేశారు.

ఈ ప్రాజెక్టులతో రాష్ట్రంలో 500 క్రిటికల్‌ కేర్‌ బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్లు, అల్ట్రాసౌండ్‌ సదుపాయాలతో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం మరింత చేరువ కానుంది. అత్యాధునిక వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులను తగ్గించేలా ఈ సదుపాయాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో వైద్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని అన్నారు. దేశంలో మెడికల్‌ సీట్లను 51 వేల నుంచి రెండింతలకుపైగా పెంచారని తెలిపారు. కోవిడ్‌ సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్‌ అందించిన ఘనత భారతదేశానికి, ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌ను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని, జన ఔషధి కేంద్రాల ద్వారా పేదలకు మందులు అందుతున్నాయని చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!