ఏపీ కూట‌మి పాల‌న‌లో పెరిగిన బీసీల ఆత్మ గౌరవం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత

విజయవాడ : బీసీల ఆత్మ గౌరవం పెంచేలా సీఎం చంద్రబాబు నాయుడు పాలిస్తున్నారని, ప్రజల్లోని కూటమి నాయకులు, కార్యకర్తలు గర్వంతో తలెత్తుకుని వెళుతున్నారని రాబోయే స్థానిక ఎన్నికల్లో తమదే విజయమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ధీమా వ్యక్తంచేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామని స్పష్టం చేశారు. జగన్ లో మరో ఓటమి భయం కనిపిస్తోందన్నారు. కోర్టుల్లో నిలబడేలా బీసీ రక్షణ చట్టాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్ లో వివిధ బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో బీసీ రక్షణ చట్టంపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బీసీలంటేనే టీడీపీ అని స్పష్టంచేశారు. బీసీల ఆత్మగౌరవం పెంచేలా సీఎం చంద్రబాబు నాయుడు పాలిస్తున్నారన్నారు. గత ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ నిర్వహించిన పాదయాత్రలో బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, బీసీ రక్షణ చట్టం అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

కోర్టుల్లో బలంగా నిలబడేలా ఈ చట్టానికి తుది మెరుగులు దిద్దుతున్నామన్నారు ఎస్. స‌విత‌. దీనిలో భాగంగా మంత్రివర్గ ఉప సంఘంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశాలు నిర్వహించామన్నారు. బీసీలను కులం, వృత్తుల పేరుతో దూషించినా, సంఘ బహిష్కరణలు చేసినా చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామన్నారు. జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని, రెండు నెలల్లో కేసుల దర్యాప్తు పూర్తి చేసేలా నిబంధనలు రూపొందించామని చెప్పారు. బీసీ రక్షణ చట్టాన్ని కోర్టుల్లో నిలబడేలా రూపొందిస్తున్నామన్నారు. ఇప్పుడు 156 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేషన్ల చైర్మన్ల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీలోనే బీసీ రక్షణ చట్టం అమలుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్ల‌డించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. 19987 అన్న ఎన్టీఆర్ తొలిసారిగా బీసీలకు రిజర్వేషన్లకు అమలు చేశారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం బీసీలకు 34 శాతానికి రిజర్వేషన్లు పెంచారన్నారు. 2019 తరవాత అధికారంలోకి వచ్చిన జగన్ …బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి కుదించారన్నారు. గొడ్డలి పార్టీ చర్యతో బీసీలకు రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. మరోసారి 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి సవిత తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!