అమరావతి : రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాన్ని మరింత బలోపేతం చేసి, పౌల్ట్రీ రైతులకు అండగా నిలిచేందుకు ఏపీ పౌల్ట్రీ డెవలప్‌మెంట్ పాలసీ 2026–29కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పాలసీకి ఆమోదం తెలిపిన సందర్భంగా పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలోని కార్యాలయంలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలసీని త్వరితగతిన అమల్లోకి తీసుకు వచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పౌల్ట్రీ రంగానికి నూతన ఊతం అందించడంతో పాటు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఉత్పాదకతను పెంచడం, ఉపాధి అవకాశాలను మెరుగు పరచడం లక్ష్యంగా పాలసీని రూపొందించినట్లు చెప్పారు. పౌల్ట్రీ రంగ అభివృద్ధికి ప్రభుత్వం రూ.657 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిందని వివరించారు. ఇందులో ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన ప్రోత్సాహకాల కోసం రూ.209 కోట్లు, ఇండస్ట్రియల్ పాలసీ కింద రూ.152.18 కోట్లు, పశుసంవర్థక శాఖ ద్వారా అమలు చేయనున్న కార్యక్రమాలకు రూ.296 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.
కోళ్ల ఫారాలు, హేచరీస్ లకు సంబంధించి మౌలిక వసతుల అభివృద్ధికి తీసుకునే రుణాలపై 4 శాతం వడ్డీ రాయితీ కల్పించనున్నామని, ఇందు కోసం మూడేళ్ల కాలానికి రూ.72 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. పౌల్ట్రీ రైతుల విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు లో-టెన్షన్ కోళ్ల ఫారాలకు యూనిట్‌కు రూ.3.75, ఫీడ్ మిక్సింగ్ యూనిట్లకు యూనిట్‌కు రూ.4.75 చొప్పున టారిఫ్‌ను క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసే ఎన్విరాన్‌మెంట్ కంట్రోల్డ్ (EC) పౌల్ట్రీ షెడ్లకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై 25 శాతం వరకు, గరిష్ఠంగా రూ.25 లక్షల వరకు క్యాపిటల్ సబ్సిడీ అందించనున్నాం అని ప్రకటించారు కింజారపు అచ్చెన్నాయుడు. ఇప్పటికే ఉన్న పౌల్ట్రీ షెడ్లను ఆధునీకరించేందుకు కూడా 25 శాతం వరకు, గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు సబ్సిడీ అందించేలా ప్రతిపాదించాం అన్నారు. అర్హత కలిగిన EC పౌల్ట్రీ ఫారాలకు టర్మ్ లోన్లపై వడ్డీ సబ్సిడీతో పాటు విద్యుత్ చార్జీలపై యూనిట్‌కు రూ.2 వరకు, సంవత్సరానికి గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు, మూడు సంవత్సరాల పాటు విద్యుత్ టారిఫ్ సబ్సిడీ అందించనున్నాం అని తెలిపారు. అలాగే నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ (NLM) కింద అర్హత కలిగిన ప్రాజెక్టులకు 50 శాతం వరకు క్యాపిటల్ సబ్సిడీ, గరిష్ఠంగా రూ.25 లక్షల వరకు అందించే అవకాశం కల్పించామని పేర్కొన్నారు.
