తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలు 23వ తేదీ వరకు కొనసాగుతాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు 30 శాతం అదనంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. గరుడసేవ రోజున 38 శాతం అదనంగా అన్న ప్రసాదాలు, శ్రీవారి ఆలయంలో 30 శాతం అదనంగా స్వామివారి ప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ వంటి పానియాలను 50 శాతం అదనంగా పెంచుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులను 500 ట్రిప్పులు అదనంగా పెంచి 3100 ట్రిప్పులకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
మంగళవారం సాయంత్రం 6.21 నుండి 6.35 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. అనంతరం 16వ తేది ఉదయం తిరుమలలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్-1 లో నూతనంగా ఏర్పాటు చేసిన పిల్ గ్రిమ్ ఎక్స్ పీరియన్స్ సెంటర్, ఎస్వీ మ్యూజియం, ఎలక్ట్రిక్ బస్సులు, నందకం యాప్, భక్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలను ప్రారంభిస్తారని వెల్లడించారు.
