హైదరాబాద్ : భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సెప్టెంబర్ 17న గురువారం హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. ఈ మేరకు ఆయన ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత కార్యదర్శులు, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 17న జరగనున్న ‘తెలంగాణ విమోచన దినోత్సవ’ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వస్తున్నారని తెలిపారు.
ఆయన గురువారం ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్కు చేరుకుంటారని, ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం కోసం సంబంధిత శాఖలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయని సీఎస్ పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, రోడ్లు , భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, డిజిపి సి.వి. ఆనంద్, వైద్యా ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టీనా చోంగ్తు, హైదరాబాద్ , మల్కాజిగిరి పోలీస్ కమిషనర్లు సజ్జనార్, సుమతి, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఇదిలా ఉండగా ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ రాక సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని, సెక్యూరిటీ విషయంపై ఫుల్ ఫోకస్ పెట్టాలన్నారు సీఎస్.
