తిరుమ‌ల‌లో ప్ర‌త్యేకంగా మీడియా సెంట‌ర్ ఏర్పాటు

మీడియా ప్ర‌తినిధులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే

తిరుమ‌ల : టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు తిరుమలలో కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫల, పుష్ప, ఫోటో, గార్డెన్, అటవీ, ఎస్వీఐటీఎస్ఏ, ఆయుర్వేద తదితర ప్రదర్శనలతో పాటు రామ్ భగీచా-2లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సెంటర్‌లో చైర్మన్ మాట్లాడారు. తిరుమలలో తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాది మంది భక్తుల కోసం టీటీడీ చేసిన విస్తృత ఏర్పాట్లను, బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకు తెలియజేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని కోరారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా మీడియా ప్రతినిధులు విస్తృతంగా వార్తా కథనాలు అందించేందుకు వీలుగా మీడియా సెంటర్‌లో వైఫై, కంప్యూటర్లు, ప్రింటర్లు, బ్యాండ్‌విడ్త్ తదితర అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మీడియా ఈ సౌకర్యాలను వినియోగించుకుని తిరుమల బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని అన్నారు. కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని చైర్మన్ తెలిపారు. ముఖ్యంగా తిరుమలలో గతంలో ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అరుదైన ఛాయాచిత్రాల ద్వారా తెలియజేసే “నాడు–నేడు” ఫోటో ప్రదర్శన ఎంతో ప్రత్యేకంగా ఉందన్నారు. తిరుమలలో కాలక్రమేణా జరిగిన అభివృద్ధి, మార్పులను ఈ ఫోటోలు చక్కగా ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు.

భక్తులు ఈ ప్రదర్శనను తప్పక సందర్శించి తిరుమల చరిత్ర, వైభవం, అభివృద్ధిని తెలుసుకోవాలని చైర్మన్ కోరారు. ఈ ప్రదర్శన భక్తులకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక, చారిత్రక అనుభూతిని అందిస్తుందని అన్నారు. గార్డెన్, అటవీ, శ్రీ వేంకటేశ్వర శిల్ప కళాశాల, ఆయుర్వేద తదితర విభాగాలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయని చైర్మన్ అభినందించారు. వివిధ అంశాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు తిరుమలకు వచ్చే భక్తులకు విజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్నాయని పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!