అంగ‌రంగ వైభోగం కళాకారుల నృత్య నీరాజనం

తిరుమాడ వీధుల్లో వెల్లివిరిసిన భారతీయ సంస్కృతి

తిరుమల : తిరుమ‌ల‌లో శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభవోపేతంగా కొన‌సాగుతున్నాయి. భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంస వాహన సేవ భక్తి వైభవంతో, సాంస్కృతిక శోభతో ఘనంగా జరిగింది. హంస వాహనంపై సరస్వతి అలంకారంలో కొలువైన శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించారు. శ్రీవారి హంస వాహన సేవలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు 8 రాష్ట్రాలకు చెందిన 19 కళా బృందాల నుంచి 504 మంది కళాకారులు పాల్గొన్నారు. విభిన్న జానపద, సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శిస్తూ భక్తులను అలరించారు.శ్రీవారి వాహనానికి ముందుగా జీయర్ స్వాములు నారాయణ దివ్య ప్రబంధాన్ని గానం చేస్తూ ముందుకు సాగారు. వందలాది మంది శ్రీవైష్ణవులు వారిని అనుసరించారు. అశ్వ, వృషభ, గజరాజుల విన్యాసాలు తిరుమాడ వీధుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి . జార్ఖండ్‌కు చెందిన శ్రేష్ఠిధర్ మహతో బృందం ప్రదర్శించిన చౌ నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ముసుగులు ధరించి శరీర కదలికలు, ప్రత్యేక అడుగులు, యుద్ధ విన్యాసాలతో ప్రదర్శించే ఈ కళారూపంలో రామాయణం, మహాభారతం, పురాణ గాథలను అభినయిస్తారు.

ఎగరడం, గిర్రున తిరగడం, యుద్ధ విన్యాసాలు చేయడం చౌ నృత్యంలోని ప్రత్యేకతలు. జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వివిధ శైలుల్లో ప్రదర్శించే చౌ నృత్యం నృత్యం, నాటకం, యుద్ధకళల సమ్మేళనంగా ప్రసిద్ధి చెందింది. గుజరాత్‌కు చెందిన గర్బా నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సంప్రదాయ బద్ధంగా దీపంతో కూడిన మట్టి కుండ చుట్టూ స్త్రీ, పురుషులు కలిసి చేసే ఈ నృత్యం ఉత్సాహ భరితంగా సాగింది. ఉత్తరాఖండ్‌కు చెందిన చోలియా నృత్యం కళాకారుల యుద్ధ విన్యాసాలతో ఆకట్టుకుంది. పంజాబ్‌కు చెందిన కళాకారుల భాంగ్రా నృత్యం ఉత్సాహ భరితమైన అడుగులతో తిరుమాడ వీధుల్లో సందడి చేసింది. పంటల పండుగలతో అనుబంధం ఉన్న భాంగ్రా నృత్యం భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది.

వీటితోపాటు కర్రసాము, కోలాటం, డ్రమ్స్, లంబాడీ నృత్యం, యోగచాప్ తదితర కళారూపాలను కళాకారులు ప్రదర్శించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో దేశంలోని విభిన్న ప్రాంతాల జానపద కళలకు వేదిక కల్పించడం ద్వారా “ఏకం సత్‌ – విభిన్న కళా సంప్రదాయాలు” అనే భారతీయ సాంస్కృతిక వైవిధ్యం భక్తులకు కనువిందు చేసింది. భక్తి, కళ, సంప్రదాయం మేళవింపుతో హంస వాహనసేవ తిరుమాడ వీధుల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను నింపింది.

Leave A Reply

Your Email Id will not be published!