వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా

పీఎం-సూర్యఘర్ పథకం అమలు వేగవంతం

తిరుపతి : ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలో పీఎం-సూర్యఘర్ పథకం కింద అర్హులైన ఎస్సీ,ఎస్టీ వినియోగదారుల గృహాలపై రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఆ సంస్థ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి స్ప‌ష్టం చేశారు. తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి పీఎం-సూర్యఘర్ పథకం అమలు, విద్యుత్ సరఫరా స్థితిగతులు, బిల్లుల వసూళ్లు తదితర అంశాలపై అధికారులు, కాంట్రాక్టర్లతో సీఎండీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. పీఎం- సూర్యఘర్ పథకాన్ని అర్హులైన ఎస్సీ,ఎస్టీ గృహ వినియోగదారులకు మరింత చేరువ చేయాలని పేర్కొన్నారు. ఈ పథకం ప్రయోజనాలపై వినియోగదారులకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని స్ప‌ష్టం చేశారు.

విద్యుత్ సరఫరా పరిస్థితులను సమీక్షిస్తూ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎండీ ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలకు కారణాలను గుర్తించి, సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చేపట్టాలని సూచించారు. సంస్థ పరిధిలో విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు తదితర విద్యుత్ వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ముందస్తు నిర్వహణా చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. విద్యుత్ బిల్లుల వసూళ్లపై కూడా ఈ సందర్భంగా సీఎండీ సమీక్షించారు. విద్యుత్ బిల్లుల వసూళ్ల లక్ష్యాలను సాధించేలా కార్యాచరణ రూపొందించు కోవాలని సంబంధిత అధికారులు, సిబ్బందికి సూచించారు. బకాయిల వసూళ్లకు ప్రాధాన్యత ఇవ్వాల‌ని పేర్కొన్నారు. వినియోగదారులకు సకాలంలో బిల్లులు అందేలా చూడడంతో పాటు, ఆన్ లైన్ బిల్లుల చెల్లింపుపై అవగాహన కల్పించాలని తెలిపారు.

విద్యుత్ అంతరాయాలు, వోల్టేజ్ సమస్యలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యల్ని అధిగమించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు శివ‌శంక‌ర్ లోతేటి. విద్యుత్తు వినియోగదారుల సంతృప్త స్థాయిలు నేరుగా క్షేత్రస్థాయి సేవలపై ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పనిచేసి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సీఎండీ స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!