రేపు, ఎల్లుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అనిత

విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ అధికారుల‌తో స‌మీక్ష

అమ‌రావ‌తి : మ‌రో తుపాను రానుంద‌ని దీంతో రేపు, ఎల్లుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చ‌రించారు రాష్ట్ర హోం , విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. మురసు తుపాను హెచ్చరికలతో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోం మంత్రి స‌మీక్ష చేప‌ట్టారు . వరుస తుపాన్ల నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్ప‌ష్టం చేశారు. మురసు తుపాను ప్రభావంతో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌న్నారు.అర్నబ్ తుపానులో సమర్థవంతంగా పని చేసినట్లే, మురసు తుపాను ఎదుర్కొనేందుకు సంససిద్ధతతో ఉండాలని పేర్కొన్నారు అనిత వంగ‌ల‌పూడి.

ప్రభావిత జిల్లాల వారీగా 24/7 అత్యవసర కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్డీఆర్ఎఫ్‌, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందస్తుగా ప్రభావిత జిల్లాల్లో సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాద‌ని సూచించారు. ప్రజలు అధికారిక హెచ్చరికల పట్ల నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు హోంమంత్రి. 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాల‌ని అన్నారు. లోతట్టు, ముంపు ప్రాంత ప్రజలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండే వారిని గుర్తించి తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్ప‌ష్టం చేశారు.

ప్రధాన రహదారుల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోతే తక్షణమే తొలగించే కంట్రోల్ టీమ్స్‌ను సిద్ధం చేయాలని అన్నారు. పోలిస్ , ఫైర్ సిబ్బంది, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు వంగ‌ల‌పూడి అనిత‌. మీ సమస్యలను మనమిత్ర వాట్సప్ 9552300009 ద్వారా వెంటనే తెలియ చేయాల‌ని కోరారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాల‌ని పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!