తిరుమల : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. బుధవారం ఆయన తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు. అనంతరం దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి మీడియాతో మాట్లాడారు. పవిత్రమైన దివ్యక్షేత్రంగా తిరుమలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం అన్నారు. 89.5 శాతం గ్రీన్ కవర్ తిరుమల కొండల్లో ఉందన్నారు. గతంలో ఏర్పాటు చేసిన ఎస్వీ మ్యూజియం ను ఆధునీకరించి పునః ప్రారంభం చేశామని తెలిపారు. శ్రీవారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణ గాధలు, శ్రీవారి పరిణయం లాంటి అంశాలను ప్రదర్శించేలా మ్యూజిఎంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులు అందరికీ అర్ధం అయ్యేలా వివిధ అంశాలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. టీసీఎస్ ట్రస్ట్ రూ.104 కోట్లతో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారన్నారు సీఎం.
వచ్చే ఐదేళ్ల పాటు ఈ మ్యూజియం నిర్వహణను కూడా ఆ ట్రస్టుకే అప్పగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతీ భక్తుడికీ ఎల్ఐసీ తో కలిసి భీమా కల్పించాలని టీటీడీ నిర్ణయించిందని వెల్లడించారు. ఆధార్ బేస్డ్ ఆన్ లైన్ భీమా చేయాలని నిర్ణయించాం అని తెలిపారు సీఎం. ఎవరైనా భక్తులు దురదృష్ట వశాత్తూ ఇక్కడ మృతి చెందితే వారికి రూ.2 లక్షల ఆర్ధిక సాయం అందించేలా ఈ భీమా వర్తింప చేస్తారని పేర్కొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సు1 లో దుర్లభ్ దర్శన్ పేరిట ఓ హీలింగ్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. శ్రీవారి వైభవం, ఆలయ చరిత్రను ఇతర అంశాలను వివరించేలా ఈ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ఏర్పాటు అయ్యిందన్నారు.
సామాన్య భక్తులందరికీ స్వామి వారి వైభవాన్ని అందించేలా ఈ ఎక్స్ పీరియన్స్ సెంటర్ అందుబాటులోకి వస్తుందన్నారు. తిరుమలలో భక్తుల రాకపోకల కోసం 32 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.. రిలయన్స్ ఫౌండేషన్ 25, భారత్ బయోటెక్ సంస్థ 7 ఈవీ బస్సులను విరాళంగా టీటీడీకి ఇచ్చాయన్నారు. మొత్తం 44 ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పుడు తిరుమలలో భక్తుల రాకపోకలకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆధ్యాత్మికతకు కేంద్రాలుగా దేవాలయాలు తయారు కావాలన్నది మా ఆలోచన అని చెప్పారు సీఎం.
