సరస్వతి అమ్మవారి అలంకారంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి

వీణ ధరించి జ్ఞానస్వరూపుడిగా భక్తులకు దర్శనం

తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి శ్రీ మలయప్పస్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో, వీణను ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. జ్ఞానానికి ప్రతీకగా భావించే హంస వాహనంపై శ్రీవారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వాహనసేవ సందర్భంగా తిరుమాడ వీధులు భక్తజన సందోహంతో కిక్కిరిశాయి. మంగళ వాయిద్యాల నడుమ, వేద ఘోషలు, భక్తుల గోవింద నామ స్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన కళా బృందాలు ప్రదర్శించిన సంప్రదాయ కళారూపాలు వాహన సేవకు మరింత శోభను చేకూర్చి భక్తులను విశేషంగా అలరించాయి.

హంస వాహనసేవలో శ్రీ మలయప్ప స్వామివారు జ్ఞాన స్వరూపుడిగా ప్రకాశిస్తారని పురాణాలు, ఐతిహ్యాలు తెలియ జేస్తున్నాయి. హంస బ్రహ్మదేవుని వాహనం కాగా, అది జ్ఞానానికి ప్రతీకగా భావించ బడుతుంది. పాలు–నీళ్లను వేరుచేసే హంస స్వభావం వివేకానికి, ఆత్మ–అనాత్మ విచక్షణకు సంకేతంగా పేర్కొనబడింది. పరమాత్మ తత్వాన్ని గ్రహించి, ఆత్మజ్ఞానాన్ని పొందిన మహనీయులను ఉపనిషత్తులు “పరమ హంసలు”గా అభివర్ణిస్తాయి. ఈ నేపథ్యంలో భక్తుల్లోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి, వివేకజ్ఞానాన్ని ప్రసాదించి, ఆధ్యాత్మిక ఉన్నతికి చేర్చే సంకల్పానికి హంస వాహనసేవ ప్రతీకగా నిలుస్తుంది. శ్రీవారి దివ్య దర్శనంతో భక్తుల హృదయాల్లో జ్ఞానజ్యోతి వెలిగి, ఆధ్యాత్మిక చైతన్యం వికసించాలని ఈ సేవ సందేశమిస్తుంది.

గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమలలో, హంస వాహనంపై జ్ఞాన స్వరూపుడిగా వెలసిన శ్రీ మలయప్ప స్వామివారి దివ్య దర్శనం భక్తులకు ఆధ్యాత్మక ఆనందాన్ని పంచింది. ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!