విజయవాడ : మురాసు తుపాను ప్రభావం ఏపీని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే అర్నబ్ తుపాను మరిచి పోక ముందే మరో తుపాను రాకతో నానా తంటాలు పడుతున్నారు ప్రజలు. ఈ తీవ్ర తుపాను కారణంగా పలు విమాన సర్వీసులను ముందస్తుగా రద్దు చేశారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం 2న బంగాళాఖాతంలో ‘మురాసు’ తుపాను తీవ్ర తుపానుగా మారింది. గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇది మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు ,నర్సాపురం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. సోమవారం నాడు పశ్చిమ-మధ్య , నైరుతి బంగాళాఖాతంలో ఈ తుపాను తీవ్ర తుపానుగా బలపడటంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు ఒడిశా రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను తీరానికి దగ్గరవుతున్న నేపథ్యంలో ఇండిగో సంస్థకు చెందిన 11 విమానాలు చెన్నై నుండి, 10 విమానాలు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రద్దు చేయబడ్డాయి.
భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ తుపాను సోమవారం రాత్రి 11:30 గంటల నుండి మంగళవారం తెల్లవారుజామున 4 గంటల మధ్య నెల్లూరు – నర్సాపురం తీర ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో గాలుల వేగం గంటకు 100-110 కి.మీ, గరిష్టంగా 120 కి.మీ వరకు ఉండవచ్చు. తీరాన్ని తాకడానికి ముందే ఈ తుపాను మరింత బలపడే అవకాశం ఉందని కూడా వాతావరణ సంస్థ హెచ్చరించింది. చెన్నై విమానాశ్రయం నుండి అందిన సమాచారం ప్రకారం చెన్నై , విజయవాడ, రాజమండ్రి, కడప, తిరుచిరాపల్లి నగరాల మధ్య నడవాల్సిన మొత్తం 21 విమాన సర్వీసులు ప్రతికూల వాతావరణం కారణంగా రద్దు చేశారు. తీవ్ర తుపాను ‘మురాసు’ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గర వుతుండటంతో భారీ వర్షాల కారణంగా చెన్నైలో జనజీవనం స్తంభించింది.
సోమవారం విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరాల్సిన 10 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ప్రయాణికులు తమ విమాన ప్రయాణ స్థితిని ఎయిర్‌లైన్ సంస్థను సంప్రదించి ధృవీకరించు కోవాలని విమానాశ్రయ అధికారులు సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విమానాశ్రయంలో లేదా గాలిలో వేచి ఉండే సమయం పెరిగే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు ఇండిగో సంస్థ ప్రత్యేక సూచనలను జారీ చేసింది. తిరువళ్లూరు , చెన్నైలలో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ‘మురాసు’ తుపాను తీరానికి చేరువ అవుతుండటంతో, చెన్నై, దాని పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరానికి ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేయబడింది. చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట, వెల్లూరు , నీలగిరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
