చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నై వేదికగా టీవీకే నూతన ప్రభుత్వం కీలకమైన 2026-2027 సంవత్సరానికి నూతన బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఈ సందర్బంగా సాంకేతికతతో పాటు వ్యవసాయ రంగం, మహిళా సాధికారత, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ఏర్పాటు, యువతకు స్కిల్ నైపుణ్యం, తదితర వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు సీఎం. సభ సాక్షిగా గత కొంత కాలంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న జల వివాదం, ప్రాజెక్టుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్.
ఈ సందర్బంగా ఆయన జోక్యం చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. మేకదాటు ఆనకట్ట అంశం వివాదానికి సంబంధించి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దయచేసి మెకెదాటు ఆనకట్ట అంశంపై రాజకీయాలు చేయకండి అని హితవు పలికారు ప్రతిపక్షాలకు. మా వైఖరి ఏదైనప్పటికీ, దానిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖ ద్వారా ఇప్పటికే తెలియ చేయడం జరిగిందని చెప్పారు. నదీ జలాల సమస్య లేదా మెకెదాటు ఆనకట్ట విషయంలో మా హక్కుల విషయంలో తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని నొక్కి చెప్పారు సీఎం గత చరిత్రను ప్రస్తావించి చౌకబారు రాజకీయాలకు పాల్పడటం నాకు ఇష్టం లేదన్నారు. ఈ విషయంలో ఎవరికి రాజకీయ ప్రయోజనం చేకూరుతుంది లేదా ఎవరు దీనికి సంబంధించిన ఘనతను దక్కించుకుంటారు అనే విషయాల గురించి ఆలోచించకండి అని తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు సూచించారు.
