హైదరాబాద్ : విద్యుత్ వినియోగదారులకు మరింత చేరువగా సేవలను అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ బస్తీ బాత్ పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా 21 సర్కిళ్లలో టీజీఎస్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది ఏకకాలంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వినియోగదారుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం అని స్పష్టం చేశారు ఈ సందర్బంగా సీఎండీ జితేష్ వి. పాటిల్.
టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని ఆయా సర్కిళ్లలో చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు, డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, లైన్‌మెన్లు, సహాయక లైన్‌మెన్లు, ఆర్టిసాన్లు, ఇతర విద్యుత్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పాల్గొని విస్తృత నిర్వహణ పనులను చేపట్టారు.
నేరుగా బస్తీలు, కాలనీలు, గ్రామాలు, కుగ్రామాలు, పట్టణ ప్రాంతాలకు వెళ్లి వినియోగదారులను కలిసి వారి విద్యుత్ సంబంధిత సమస్యల గురించి తెలుసుకున్నారు. వారు ఫిర్యాదులను నమోదు చేసుకుని, వీలైనంత వరకు అక్కడికక్కడే వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నారు. పరిష్కరించాల్సిన సమస్యల కోసం వారు సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసే చర్యలలో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్ల తనిఖీ, సబ్‌స్టేషన్ల పనితీరు, ట్రాన్స్‌ఫార్మర్ పరిసరాల శుభ్రత, ట్రాన్స్‌ఫార్మర్లకు అంటుకున్న చెట్ల కొమ్మల తొలగింపు, లైన్ కారిడార్ క్లియరెన్స్, వదులుగా ఉన్న విద్యుత్ తీగలను బిగించడం, దెబ్బతిన్న కండక్టర్లను గుర్తించడం, ఇంటర్-పోల్స్ ఏర్పాటు, దెబ్బతిన్న లేదా వంగి పోయిన విద్యుత్ స్తంభాలను మార్చడం వంటి పనులను విస్తృతంగా చేపట్టారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు వారు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
ఇదిలా ఉండగా విద్యుత్ అధికారులు, సిబ్బంది నేరుగా తమ వద్దకు వచ్చి సమస్యలను అర్థం చేసుకుని, తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవడంతో ‘బస్తీ బాత్’ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని పలువురు వినియోగదారులు అభిప్రాయపడ్డారు.