న్యూఢిల్లీ : ప్రజారోగ్యానికి, వినియోగదారుల భద్రతకు సంభావ్య ప్రమాదాలను ఉటంకిస్తూ అనేక రాష్ట్రాలు నకిలీ (పాలేతర) పన్నీర్ తయారీ, అమ్మకాలపై కఠిన చర్యలు ప్రారంభించాయి. అసలైన పన్నీరు గా విక్రయించ బడుతున్న నాసిరకం నకిలీ పాల ఉత్పత్తులను ఈ చర్యలు లక్ష్యంగా చేసుకున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ పన్నీర్ తయారీ అమ్మకం, నిల్వ, రవాణా పంపిణీపై పూర్తి నిషేధాన్ని విధించింది. ఆహార భద్రతపై ఆందోళనలు, మార్కెట్లో నకిలీ పన్నీర్ లభ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త నిబంధనలను పాటించాలని డెయిరీ యజమానులు, వ్యాపారులకు సూచించారు.
గుజరాత్ ప్రభుత్వం నాణ్యత లేని అనలాగ్ పన్నీర్, చీజ్ , వెన్న ఉత్పత్తి, అమ్మకం, నిల్వ పంపిణీని కూడా నిషేధించింది. ప్రజారోగ్యాన్ని కాపాడటం, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం ఈ చర్య యొక్క లక్ష్యమని అధికారులు తెలిపారు. ఆహార భద్రత , ప్రమాణాల చట్టం కింద నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాలకు బదులుగా కూరగాయల కొవ్వులు , ఇతర పాలేతర పదార్థాలను ఉపయోగించి అనలాగ్ పన్నీర్‌ను తయారు చేస్తారు కాబట్టి, పనీర్ కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఆహార భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. తాము కొనుగోలు చేసేది అసలైన పన్నీరేనని నిర్ధారించు కోవడానికి వినియోగదారులు ఉత్పత్తి లేబుళ్లను సరిచూసు కోవాలని, విశ్వసనీయమైన మూలాల నుండి పాల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రోత్సహిస్తున్నారు.
కల్తీ లేదా తప్పుదోవ పట్టించే పాల ఉత్పత్తుల అమ్మకాలను నివేదించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సురక్షితం కాని ఆహార పదార్థాలు వినియోగదారులకు చేరకుండా నిరోధించడానికి తనిఖీలను ముమ్మరం చేశారు.
