అమరావతి : ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాయమలసీమ ప్రాంత ప్రజలకు తీపి కబురు చెప్పారు. బుధవారం రాయలసీమ త్రాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుండి నీటి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన సచివాలయంలో ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఎల్ నినో నేపధ్యంలో 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను కేవలం తాగునీటి కోసం భద్రపరచు కోవాలని స్పష్టం చేశారు. ఏ మాత్రం నీటిని వృధా చేసినా రేపొద్దున తాగేందుకు ఒక్క చుక్క కూడా అందదని, ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు మంత్రి నిమ్మల రామానాయుడు.
నేటికి శ్రీశైలం వద్ద ఉన్న 119 టిఎంసిలకు తోడు, రాబోయే 10 రోజులలో మరొక 100 టిఎంసిల వరకు ఇన్ ఫ్లో రావచ్చని అంచనా వేస్తున్నాం అన్నారు. కృష్ణా జలాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్టానికి సంబంధించిన 63 శాతం వాటాను ప్రధమంగా త్రాగునీటికే ప్రాధాన్యత ఇస్తున్నాం అని స్పష్టం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ నీటిని ఎల్ నినో దృష్ట్యా, ప్రధమ ప్రాధాన్యతగా త్రాగునీటికి విడుదల చేస్తున్నామని తెలిపారు నిమ్మల రామానాయుడు. హంద్రీనీవా పరిధిలోని రిజర్వాయర్స్ త్రాగునీటి అవసరాల కోసం, 13 టిఎంసిలు అవసరం అవుతాయని తెలిపారు. పోతిరెడ్డిపాడు పరిధిలోని రిజర్వాయర్లకు త్రాగునీటి కోసం 10 టిఎంసిలు రేపటి నుండి విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు.
తెలుగుగంగ ద్వారా చెన్నై త్రాగు నీటి కోసం 10 టిఎంసిల నీరు విడుదల చెయ్యాల్సి ఉందన్నారు మంత్రి. నాగార్జున సాగర్, రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ పరిధి త్రాగునీటికి 32 టిఎంసిలు అవసరం పడుతుందన్నారు.వారం, వారం సమీక్ష చేసుకుని ఎల్ నినో విపత్తును ఎదుర్కొనే విధంగా వర్షాలు, వరదలు ఆధారంగా ప్రణాళికాబద్దంగా చర్యలు చేపడతాం అన్నారు.
