అమరావతి : గత వైసీపీ ప్రభుత్వం ఏపీని సర్వ నాశనం చేసిందని సంచలన ఆరోపణలు చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అడవి పందులు పంటను నాశనం చేసినట్టుగా నాటి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని తీవ్రంగా విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన రెవెన్యూ లోటు నిధులను కూడా ముందుగానే ఖర్చు చేశారని అన్నారు. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతో ఆగకుండా రాష్ట్ర భవిష్యత్తును మార్చే అనేక కీలక ప్రాజెక్టులను కూడా విధ్వంసం చేశారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి నగర నిర్మాణాన్ని నిలిపివేశారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులను మళ్లీ గాడిలో పెట్టామని, నిర్మాణ పనులు వేగంగా చేపడుతున్నామని తెలిపారు. గతంలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్రం నవ్వుల పాలైందని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు ప్రపంచంలో అమరావతికి గుర్తింపు తీసుకొచ్చే ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. డిసెంబరులో క్వాంటం వ్యాలీని ప్రారంభిస్తామని ప్రకటించారు. 2028లో అమరావతి ఫేజ్-1ను ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని సీఎం స్పష్టం చేశారు. పోలవరంతోనే ఆగకుండా రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. రూ.37,766 కోట్లతో 36 ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఏపీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని… ట్రిపుల్ రీజియన్ ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అమరావతి, తిరుపతి, విశాఖ కేంద్రంగా ఎకనమిక్ రీజియన్ల వారీగా అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు.
