హైదరాబాద్ : ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన అతిపెద్ద సినీ ప్రయాణం ఇంకా ముందు ఉందని పేర్కొన్నారు . తన కెరీర్ గురించి మాట్లాడారు. గ్లోబల్ బ్లాక్బస్టర్ ఆర్ఆర్ఆర్ గురించి మరోసారి ప్రస్తావించారు. తన రాబోయే చిత్రం వారణాసి భారతీయ చిత్రసీమలో తాను సాధించాలని అనుకుంటున్న దానికి కేవలం ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు దర్శక ధీరుడు జక్కన్న.గత కొన్నేళ్లుగా అనేక బ్లాక్బస్టర్ చిత్రాలను అందించిన రాజమౌళి, కథనం , దృశ్య చిత్ర నిర్మాణంలో సరిహద్దులను నిరంతరం అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆయన ప్రకారం ప్రతి కొత్త ప్రాజెక్ట్ తన మునుపటి పని కంటే పెద్దదిగా , మెరుగైనదిగా ఏదైనా సృష్టించడానికి ఒక అవకాశంగా భావిస్తున్నారు.
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జోనస్ , పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆయన రాబోయే చిత్రం వారణాసి రూపు దిద్దుకుంటోంది. భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. ఈ చిత్రాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు . ఇది ఒక ప్రత్యేకమైన సినీ అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రాజమౌళి వ్యాఖ్యలు అభిమానులలో ఉత్సాహాన్ని పెంచేలా చేశాయి. ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్త విజయం తర్వాత, వారణాసి ఆయన కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని వారు నమ్ముతున్నారు. దర్శకుడి ఆత్మ విశ్వాసం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
‘వారణాసి’ చిత్రీకరణ నిలకడగా సాగుతుండటంతో, రాజమౌళి తన ప్రతిష్టాత్మకమైన దృష్టితో భారతీయ సినిమాను తదుపరి స్థాయికి ఎలా తీసుకెళ్తాడో చూడటానికి ప్రేక్షకులు ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
