చెన్నై : తన అరెస్ట్ కుట్ర పూరితమని పేర్కొన్నారు ఉదయనిధి స్టాలిన్. తమిళనాడు ముఖ్యమంత్రికి, నటి త్రిషకు మధ్య ఉన్న స్నేహం గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా మంగళవారం పోలీసుల అదుపులోకి తీసుకునన్నారు . తనపై తప్పుడు కథనాన్ని సృష్టించారని ఆరోపించారు. కావేరీ నదీ జలాల వివాదంపై నిన్న జరిగిన నిరసన సభలో ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్ నేపథ్యంలో, తంజావూరు (తూర్పు) పోలీసులు ఈ రోజు చెన్నైలోని నీలంకరైలో ఉన్న ఆయన నివాసం నుండి అదుపులోకి తీసుకుని తంజావూరుకు తరలించారు. అక్కడ ఆయనను విచారించే అవకాశం ఉంది. ఉదయనిధి స్టాలిన్‌పై BNS చట్టంలోని సెక్షన్లు 61, 79, 192, 196, 296(b), 351(2), 352, అలాగే TN మహిళల వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ 4 , IT చట్టం సెక్షన్ 67 కింద కేసులు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న తర్వాత విలేకరులతో మాట్లాడారు ఉదయనిధి స్టాలిన్.
తాను ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని ఖండించారు; ఎడిట్ చేసిన , తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను ప్రచారం చేయడం వల్లే ఈ వివాదం తలెత్తిందని ఆయన పేర్కొన్నారు. నేను ఎప్పుడూ అనని మాటలను అన్నట్లుగా చూపించడానికి వారు ‘కట్, కాపీ, పేస్ట్’ పద్ధతిని ఉపయోగించి తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. ఇలాంటి వాటికి భయపడే రకం మనిషిని నేను కాదు. దీనిని చట్టపరంగా ఎదుర్కొంటాను అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. తనపై పోలీసులు తీసుకున్న చర్య ఒక కామెడీ అని ఆయన పేర్కొన్నారు. ఒక సభలో ఉదయనిధి ప్రసంగిస్తుండగా, అక్కడి జనం “త్రిష, త్రిష” అని నినాదాలు చేస్తూ అంతరాయం కలిగించడంతో ఈ వివాదం మొదలైంది. కాసేపు ఆగి, ఆయన నీళ్లు వేరే ఎక్కడికి చేరినా చేరకపోయినా, అక్కడికి మాత్రం కచ్చితంగా చేరాలి అని వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత తాను కావేరీ నదీ జలాల గురించి మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. అయితే, ఈ వ్యాఖ్యల తర్వాత, నటి త్రిషను ఉద్దేశించి ద్వంద్వార్థం వచ్చేలా మాట్లాడారని ఆరోపిస్తూ టీవీకే మహిళా విభాగం తంజావూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఉదయనిధి వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి; బీజేపీ , టీవీకే నాయకులు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా, డీఎంకే మాత్రం ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, అవి ఏ వ్యక్తిని ఉద్దేశించి చేసినవి కావని వాదించింది.
