హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ఇవాళ మరో రూ. 2 వేల కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చాటుకుంది సర్కార్. ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో రూ. 6,000 కోట్ల బకాయిలను విడుదల చేస్తామన్న మాటను తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతూ తమ చిత్తశుద్ధిని మరోసారి చాటుకుంది.
గత మే 29న మొదటి విడత గా రూ. 2,000 కోట్లు, జూన్ 30న రెండో విడతగా రూ. 2,000 కోట్లు, మూడో విడత మరో రూ. 2,000 కోట్లు గురువారం విడుదల చేశారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పదే పదే చెబుతూ వచ్చారు సీఎం. విశ్రాంత ఉద్యోగులకు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ ప్రభుత్వం ఈ నిధులతో పూర్తిగా చెల్లించింది. రాబోయే రోజుల్లో మిగిలిన ఇతర బకాయిలను కూడా ఇదే రీతిలో క్రమపద్ధతిలో క్లియర్ చేస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల నిధులు విడుదల చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది తీవ్ర హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న సానుకూల ధోరణి అభినందనీయమని ఉద్యోగ జేఏసీ నేతలు కొనియాడారు.
