హైదరాబాద్ : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు వ్యవసాయ రంగం గురించి. కేంద్రం ఆధునిక సాగు పద్ధతులు, పంటల బీమా , కీలక వ్యవసాయ పథకాలపై దృష్టి సారించనుందని వెల్లడించారు. తెలంగాణలో వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి కేంద్రం ఒక రోడ్ మ్యాప్‌ను రూపొందించి అమలు చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు చేరవేయడం, తద్వారా పురోగతి సాధించిన రైతుల (కొందరు ఎకరాకు రూ. 5 లక్షల వరకు సంపాదిస్తున్నారు) స్థాయికి ఇతరుల ఆదాయాన్ని పెంచడంలో సహాయ పడేలా ఈ రోడ్‌మ్యాప్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో జరిగిన “ఆశీర్వాద్ కా దియా” కార్యక్రమంలో చౌహాన్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా పీఎం-కిసాన్ , ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ , ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన , సాయిల్ హెల్త్ కార్డ్ పథకం వంటి కేంద్ర పథకాలను తెలంగాణలో పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు శుక్రవారం హైదరాబాద్‌లో దక్షిణ రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, రైతుల రిజిస్ట్రీ, ఎరువుల నిర్వహణ, ఉద్యానవన సాగు, ప్రకృతి వ్యవసాయం, పప్పుధాన్యాల సాగు, ప్రిసిషన్ ఫార్మింగ్ (ఖచ్చితత్వ వ్యవసాయం) వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ హయాంలో ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ ను అమలు చేయక పోవడంపై ఆయన విమర్శలు గుప్పించారు.
పంట నష్టాల నుండి రైతులకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు, వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. కేంద్ర సంక్షేమ పథకాలు తిమ్మాపూర్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలకు చేరాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ గ్రామంలో రూ. 100 కోట్లకు పైగా విలువైన రహదారి మౌలిక సదుపాయాల పనులు చేపట్టామని ఆయన తెలిపారు. అలాగే, రాయితీపై ఎరువుల సరఫరా ద్వారా రైతులకు ఎకరాకు సుమారు రూ. 18,000 మేర ప్రయోజనం చేకూరుతోందని రెడ్డి చెప్పారు. రైతులకు అండగా నిలిచేందుకు, అనేక దేశాల్లో ఎరువుల ధరలు పెరిగినప్పటికీ కేంద్రం వాటి ధరలను యథాతథంగా ఉంచిందని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 80 కోట్లకు పైగా ప్రజలు చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పొందుతున్నారని వెల్లడించారు.
