అమరావతి : ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. ఆయన ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్బంగా అక్కడ జరుగుతున్న పనుల పురోగతిపై ఆరా తీశారు. సాధ్యమైనంత మేరకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వచ్చే ఏడాది 2027 మార్చి నెలాఖరు నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ మాత్రం ఆలస్యం జరిగినా లేదా నిర్లక్ష్యం వహించినా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈసిఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతి ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు నిమ్మల రామా నాయుడు. ఈ డ్యామ్ కు సంబంధించి గ్యాప్-1 నిర్మాణ పనులు 49 శాతం, గ్యాప్-2 పనులు 43 శాతం పూర్తి చేశాం అన్నారు.
రైట్ కనెక్టివిటీస్ పనులు ఈ నెలాఖరు నాటికి, లెఫ్ట్ కనెక్టివిటీస్ పనులు నవంబర్ నాటికి పూర్తి కానున్నాయని చెప్పారు. ఈసిఆర్ఎఫ్ డ్యామ్ పనులు 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టారని తెలిపారు. రూ.536 కోట్లతో చేపట్టిన కుడి,ఎడమ గట్ల అనుసంధాన పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. 2024 జూన్ తరువాత 10,491 ఎకరాల భూసేకరణ చేసి, నిర్వాసితులకు 2,250 కోట్ల పరిహారాన్ని అందించడం జరిగిందని పేర్కొన్నారు.గత 5 ఏళ్ళ పాలనలో ఒక్క ఎకరం భూమి సేకరించ లేదని ఆరోపించారు. నిర్వాసితులకు ఒక్క రూపాయి పరిహారం అందించలేని జగన్ కు తమ గురించి, ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు నిమ్మల రామా నాయుడు.
కేంద్రం ఇచ్చిన 3850 కోట్ల రియంబర్స్మెంట్ నిధులును సైతం ప్రాజెక్టుకు గానీ, నిర్వాసితులకు గానీ ఖర్చు చేయకుండా దారిమళ్ళించారని సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ కూటమి ప్రభుత్వం ముందుగా చెప్పినట్లే హంద్రీనీవా, వెలిగొండ, పోలవరం ఎడమ కాలువలను పూర్తి చేసి నీళ్లు విడుదల చేసి దశాబ్దాల కల నెరవేర్చాం అన్నారు. రానున్న 3 ఏళ్లలో 35 వేల కోట్లు ఖర్చు చేసి 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. వచ్చే 3 ఏళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల పండుగలను తీసుకొస్తాం అని ప్రకటించారు. గత 5 ఏళ్ళ లో ఇరిగేషన్ రంగాన్ని విధ్వంసం చేసి, రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసి, దుష్ట పాలకుడిగా గొడ్డలి పార్టీ నాయకుడిగా జగన్ రెడ్డి మిగిలి పోయాడని ధ్వజమెత్తారు.
