శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం అబ‌ద్దం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉన్నట్లు కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ప‌ట్ల తీవ్రంగా స్పందించింది. ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం అల‌వాటుగా మారింద‌ని పేర్కొంది. సామాజిక మాధ్య‌మాల‌లో కొంద‌రు పనిగ‌ట్టుకుని తిరుమ‌ల ప‌విత్రత‌కు భంగం క‌లిగించేలా పోస్టులు, ఫోటోలు షేర్ చేస్తున్నార‌ని త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని తెలిపింది. వాస్తవానికి సదరు ఫొటోలో ఉన్నది శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదని స్ప‌ష్టం చేసింది. లడ్డూ తయారీ విషయంలో టీటీడీ ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తుంద‌ని , ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులతో. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయడం జరుగుతుందని, ఇది కొన్ని ఏళ్లుగా, త‌ర త‌రాలుగా కొన‌సాగుతూ వ‌స్తుంద‌ని వెల్ల‌డించింది.

కొందరు అవాస్తవాలను ప్రచారం చేయడం మంచిది కాదని హిత‌వు ప‌లికింది టీటీడీ . భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించింది. ఇందుకు సంబంధించి ఈ పోస్టుపై టీటీడీ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింద‌ని, దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.. నిర్ధారణ కాని ఫొటోలు, పోస్టులు షేర్ చేయవద్దని సూచించింది. తప్పుడు సమాచారాన్ని వైరల్ చేయవద్ద‌ని హెచ్చ‌రించింది.
నిర్ధారణ కాని ఫొటోలు, వీడియోలు, పోస్టులు ఫార్వర్డ్/షేర్ చేయవద్దని హిత‌వు ప‌లికింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నిజమని నమ్మవద్దని , అధికారిక సంస్థలు విడుదల చేసే సమాచారాన్నే విశ్వసించాల‌ని కోరింది. తప్పుడు సమాచారం కనిపిస్తే మరింత వైరల్ చేయకుండా అధికారులకు సమాచారం ఇవ్వాల‌ని తెలిపింది.

Leave A Reply

Your Email Id will not be published!