అమరావతి : కడప నగరం దేశ వ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు సీసీటీవీలను వాడడం తప్పనిసరిగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏపీ కూటమి సర్కార్ తయారీదారులకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఇందులో భాగంగా పెట్టుబడిదారులు ఏపీని ఎంచుకుంటున్నారు. తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది . సీసీటీవీ తయారీ కేంద్రంగా కొత్త గుర్తింపును పొందుతోంది కడప నగరం. విస్తృత ప్రాంతాలను కవర్ చేస్తూ అత్యుత్తమ నాణ్యత గల చిత్రాలతో ఖచ్చితమైన నిఘాను అందించే సామర్థ్యానికి పేరుగాంచిన పాన్-టిల్ట్-జూమ్ కెమెరాలు ఇప్పుడు వీరి ఉత్పత్తుల జాబితాలో కొత్తగా చేరాయి. మైదుకూరు పసుపు , ప్రసిద్ధ గండికోట గ్రాండ్ క్యాన్యన్లకు పెట్టింది పేరైన కడప. ఇప్పుడు సీసీటీవీ కెమెరాల తయారీలో ఒక ప్రధాన కేంద్రంగా జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపును పొందుతోంది. ఇక్కడ తయారయ్యే నిఘా వ్యవస్థలకు దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది.
కొప్పర్తి పారిశ్రామిక వాడలోని ఏఐఎల్ డిక్సన్ ఈ పరివర్తనలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను తయారు చేస్తోంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ కేంద్రం ప్రస్తుతం రోజుకు దాదాపు 85,000 కెమెరాలను ఉత్పత్తి చేస్తోంది. ఈ కెమెరాలకు స్థిరమైన , విస్తరిస్తున్న మార్కెట్ ఉంది. ఇక్కడ తయారవుతున్న ఉత్పత్తుల నాణ్యత ప్రపంచ స్థాయి ప్రమాణాలకు సమానంగా ఉందని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు. ఈ యూనిట్ డోమ్ కెమెరాలు, డీవీఆర్ , ఎన్వీఆర్ వ్యవస్థలతో పాటు ఇళ్లు, కార్యాలయాలు ,అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లలో ఉపయోగించే హై-రిజల్యూషన్ ఐపీ, స్మార్ట్ కెమెరాల వంటి అనేక రకాల నిఘా పరికరాలను ఉత్పత్తి చేస్తోంది.
