హైదరాబాద్ : భాగ్యనగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. పాశ్చాత్య సంస్కృతి పెరుగుతోంది. ఆకాశ హర్మ్యాలు మనుషులను కట్టి పడేస్తున్నాయి. దీంతో వర్క్ కల్చర్ కు తగ్గట్టు వ్యాపారాలు కూడా పెరుగుతున్నాయి. ప్రధానంగా ఫుడ్ కల్చర్ కు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు నగర వాసులు. ఇదే విషయాన్ని తాము గుర్తించినట్లు వెల్లడించారు టాటా స్టార్ బక్స్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి సుశాంత్ డాష్. దక్షిణ భారతదేశంలో తమ సంస్థకు సంబంధించి తొలిసారిగగా రిజర్వ్ స్టోర్ ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ సురక్షితమైన, అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. నగరంలో ప్రీమియం కాఫీ అనుభవాల పట్ల పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని టాటా స్టార్‌బక్స్ ఈ అడుగు వేస్తోందన్నారు. నగరంలో మారుతున్న కేఫ్ సంస్కృతి, వినియోగదారుల ప్రాధాన్యతలు, విస్తరణ ప్రణాళికలు, భారతదేశ కాఫీ మార్కెట్ భవిష్యత్తు గురించి చర్చించారు.
గత రెండు మూడేళ్లుగా హైదరాబాద్ లో కేఫ్ సంస్కృతి, ముఖ్యంగా స్పెషాలిటీ కాఫీ విభాగం గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. ఎక్కువ సేపు కూర్చునేందుకు ఇక్కడి వినియోగదారులు ఇష్ట పడతారని తాము గమనించామన్నారు. వినియోగదారుల స్పందన, వ్యాపార పరిస్థితులు అనుకూలంగా ఉంటే నగరంలో మరిన్ని రిజర్వ్ స్టోర్ల ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తామన్నారు. అత్యుత్తమమైన కాఫీ లోని మాధుర్యాన్ని అందించడం తమ ప్రత్యేకత అని స్పష్టం చేశారు. తమ వద్ద కూర్గ్ ప్రాంతానికి చెందిన కాఫీ అందుబాటులో ఉందని వెల్లడించారు. భారతదేశం, కొలంబియా లేదా బ్రెజిల్‌లోని ఒక నిర్దిష్ట ఎస్టేట్ లేదా ఫార్మ్ నుండి వచ్చిన కాఫీని రుచి చూసే ఛాన్స్ కలుగుతుందన్నారు.
