హైదరాబాద్ :రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ నాణ్యతను మెరుగు పరిచేందుకు ఫొటోలు లేకపోవడం, జన్మతేదీ వ్యత్యాసాలు, లింగ వివరాల్లో పొరపాట్లు, సంతకాలలో లోపాలను సరి చేసి సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా.వాసం వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటి డిజిటైజేషన్ పురోగతి, సంబంధిత అంశాలను సమీక్షించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ముఖ్యంగా గైర్హాజరైన , నివాసం మార్చుకున్న , మరణించిన , నకిలీ ఓటర్ల జాబితాల పునః పరిశీలన, విశ్లేషణ, నో మ్యాపింగ్ కేసులు, తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు.
ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఉన్న అన్ని లోపాలను అత్యంత ఖచ్చితత్వంతో సరిదిద్దాలన్నారు. అన్ని ఏఎస్‌డీడీ కేసులను తుది నిర్ణయానికి ముందు పునఃపరిశీలించి, సరైన వర్గీకరణ చేయాలని స్పష్టం చేశారు సీఈఓ . అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించ బడకుండా లేదా పొరపాటున తొలగించ బడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లోపాలు గుర్తించిన సందర్భంలో రోల్ బ్యాక్ సదుపాయాన్ని వినియోగించి, రికార్డులను మళ్లీ పరిశీలించి అవసరమైన సవరణలు చేయాలని పేర్కొన్నారు. బూత్ లెవల్ అధికారుల , బూత్ లెవల్ సూపర్వైజర్లు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు ద్వారా క్షేత్రస్థాయి ధృవీకరణను మరింత బలోపేతం చేయాలన్నారు.
బూత్ లెవల్ అధికారులతో నిర్వహించిన సమావేశాల మినిట్స్‌ను, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్ల సంతకాలతో సిద్ధం చేసి, వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు సీఈవో.85 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు గల ఓటర్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వారికి సంబంధించిన వ్యత్యాసాలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడంతో పాటు, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నిర్దేశిత గడువులో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు విభజించ బడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు.
