ఉత్తర ప్రదేశ్ : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని స్వాగతించారు. రాజ్యాంగాన్ని నమ్మే వారికి ప్రధాన్ రాజీనామా ఒక విజయం అని పేర్కొన్నారు. ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ విద్యా వ్యవస్థలో ఇంకా అనేక లోపాలు ఉన్నాయని ఒవైసీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగించారు. అహంకారం, మతతత్వం, మెజారిటీవాద రాజకీయాలను వ్యతిరేకించే వారికి, అలాగే రాజ్యాంగం, సోదరభావాన్ని విశ్వసించే వారికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక విజయమని అభివర్ణించారు. ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ విద్యా వ్యవస్థలో ఇంకా అనేక లోపాలు వేధిస్తున్నాయని ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. యువతలో నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలకు భవిష్యత్తుపై స్పష్టమైన మార్గం కనిపించడం లేదని, ప్రభుత్వం క్షేత్రస్థాయి వాస్తవాలకు దూరంగా ఉందని ఆయన ఆరోపించారు.
దేశ జనాభాలో దాదాపు సగం మంది ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారనే సందేశాన్ని ఇచ్చారని ఒవైసీ అన్నారు. వీడియో రీల్ ద్వారా ప్రధాన్ రాజీనామాను అడ్డుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నించారని, ఆయన మద్దతుదారులు కూడా అదే దిశగా ప్రయత్నాలు చేశారని ఆయన ఆరోపించారు. అయితే, ప్రజలు ద్రవ్యోల్బణం , నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతుండగా, ప్రభుత్వం మాత్రం యువత, రైతులు, నిరుద్యోగుల ఆందోళనలకు దూరంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధాన్ నిష్క్రమణతో ప్రభుత్వంపై ప్రశ్నలు అడిగేందుకు ప్రతిపక్షాలకు ధైర్యం కలిగిందన్నారు. రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఎంఐఎం ఎన్నికలకు సిద్ధమవుతోందని, తమ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆశిస్తున్నట్లు ఒవైసీ తెలిపారు. రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశ్నిస్తూ, రాష్ట్ర బాధ్యత ముఖ్యమంత్రిదే కాబట్టి దీనికి ఎవరు బాధ్యత వహించాలని ఆయన నిలదీశారు.
